దుబ్బాకలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ABN , First Publish Date - 2021-12-26T06:10:07+05:30 IST
దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో అర్హులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేతుల మీదుగా అందజేశారు.

తిమ్మాపూర్‌లో లబ్ధిదారులకు ‘డబుల్’ ఇళ్లను అప్పగించిన మంత్రి హరీశ్‌రావు
కమ్యూనిటీహాళ్లు, షాదీఖానాల ప్రారంభం
కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు
దుబ్బాక, డిసెంబరు 25: దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో అర్హులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేతుల మీదుగా అందజేశారు. అలాగే దుబ్బాక మున్సిపాలిటీల్లోని మల్లాయిపల్లి 1వ వార్డులో రెడ్డి, యాదవ, ముదిరాజ్ సంఘాల కమ్యూనిటీ హాళ్లను, రూ. 5లక్షలతో పట్టణప్రగతి భవనాన్ని ప్రారంభించారు. లచ్చపేట వార్డులో మైనార్టీ షాదీఖానాను ప్రారంభించారు. అలాగే దుబ్బాకలో కేసీఆర్‌బడిని సందర్శించారు. పాఠశాలలో చిన్న పనులుంటే త్వరగా పూర్తి చేయాలని, పాత బిల్డింగ్‌ను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దుబ్బాక ఉపాధ్యాయులు ఎల్లయ్య, నూర్‌బాబా, నారగాజు, కిష్టయ్య, జయశ్రీలతో మంత్రి హరీశ్‌రావును కలిసి 317 జీవోను సడలించి, ఉపాధ్యాయులకు న్యాయం కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నె వనిత, వైస్ చైర్‌పర్సన్ సుగుణ, కౌన్సిలర్లు తదితరులున్నారు.
అర్హులకు ఇళ్లు తప్పకుండా ఇస్తాం
దుబ్బాకలోని డబుల్ ఇళ్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కౌన్సిలర్ ఆసయాదగిరి ఆంధ్రజ్యోతి కథనాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి మంత్రి స్పందిస్తూ అనర్హుల జాబితాను తనకు ఇస్తే విచారణ జరిపి తొలగిస్తామని, అర్హులను ఎట్టి పరిస్థితిలో విస్మరించబోమన్నారు. ప్రస్తుతానికి 500 మంది జాబితానే విడుదల చేశామని, ఇంకా 400 పైచిలుకు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, వాటిని అర్హులకే ఇస్తామని చెప్పారు. తమ వార్డులోని ఎంపికలో కౌన్సిలర్లకు అవకాశం ఇవ్వాలని కౌన్సిలర్ బంగారయ్య మంత్రిని కోరగా, అర్హులు దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా వస్తుందని, దానిలో కౌన్సిలర్ల ప్రమేయం ఉండవద్దని సూచించారు. అర్హులతో దరఖాస్తు చేయించాలని, అధికారులకు సూచిస్తే తప్పకుండా విచారణ జరిపి కేటాయింపు జరుగుతుందన్నారు. ఆంద్రజ్యోతి కథనంపై విచారణ జరిపిస్తానని, అనర్హులను తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఆ లోటు కనిపిస్తున్నది..
‘దుబ్బాక అభివృద్ధి విషయంలో మాకు ఇప్పుడు ఆ లోటు కనిపిస్తుంది.. అధికారంలో ఉన్నా, దుబ్బాక సీటు కోల్పోవడం మూలంగా సుమారు రూ. 500 కోట్ల అభివృద్ధిని వదులుకున్నామని’ ఓ ఉద్యోగి మంత్రి హరీశ్‌రావు ఎదుట వాపోయారు. మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుబ్బాక పర్యటన సందర్భంగా శనివారం దుబ్బాక ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయన ఎదుట తమ గోడును వినిపించుకున్నారు. దుబ్బాక మున్సిపల్ చైర్మన్ గన్నె వనితారెడ్డి ఇంటిలో తనను కలిసిన నాయకులతో హరీశ్‌రావు మాట్లాడుతూ ‘దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉంది. తాను చదువుకున్న ఊరు, తిరిగిన నియోజకవర్గం కావడంతో అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంది. అందుకే ఆయన దుబ్బాకకు వరాలు ప్రకటించారు. ఆ పనులను పర్యవేక్షించేందుకే దుబ్బాకకు వచ్చాను’ అని తెలిపారు. గెలుపు ఓటములు సహజమని, నియోజకవర్గాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఆయన మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సమస్యలేమైనా ఉంటే ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఏళ్లనాటి కల సాకారం..
మిరుదొడ్డి, డిసెంబరు 25: మండలంలోని ధర్మారం మీదుగా దుబ్బాక మండలం దుంపలపల్లి, బల్వంతాపూర్ గ్రామం వరకు నిర్మించతలపెట్టిన ఏళ్లనాటి బీటీ రహదారి కల సాకారమైంది. శనివారం రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో రూ.4.80 కోట్లతో రహదారి ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గతంలో ఈ రహదారికి నిధులు మంజూరైనా, రాజకీయ కారణాలతో నిధులు వెనక్కు మళ్లిపోయాయి. ఇటీవల ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదనతో ప్రధానమంత్రి సడక్ యోజన కిందా నిధులు మంజూరయ్యాయి. ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. వెంట గ్రామసర్పంచు పుష్ప, ఎంపీపీ సాయిలు, నాయకులు ఉన్నారు.
ఖాతా గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ
నంగునూరు, డిసెంబరు 25: మండలం ఖాతా గ్రామంలో శనివారం జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థులు అంతకుముందు గ్రామ దేవతలకు పూజలు చేశారు. తొలుత మంత్రి హరీశ్‌రావుకు గ్రామస్థులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తడిసిన ఉమా, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.