ఆలయాలతో సంస్కారవంతమైన సమాజం

ABN , First Publish Date - 2021-08-21T06:04:59+05:30 IST

సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి ఆలయాలు దోహదం చేస్తాయని త్రిదండి చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. దుబ్బాకలో నిర్మించిన బాలాజీ వేంకటేశ్వరాలయం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని శుక్రవారం ఆయన జరిపించారు. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు హజరయ్యారు.

ఆలయాలతో సంస్కారవంతమైన సమాజం
కార్యక్రమంలో మాట్లాడుతున్న చినజీయర్‌స్వామి, చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు

ప్రజలకు రామానుజుల సందేశాన్ని చాటిచెప్పడానికే ఆయన పంచలోహ విగ్రహ ప్రతిష్ఠ   

దుబ్బాక బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో చినజీయర్‌స్వామి


దుబ్బాక, ఆగస్టు 20: సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి ఆలయాలు దోహదం చేస్తాయని త్రిదండి చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. దుబ్బాకలో నిర్మించిన బాలాజీ వేంకటేశ్వరాలయం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని శుక్రవారం ఆయన జరిపించారు. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు హజరయ్యారు. ఆలయంలో బాలాజీ వేంకటేశ్వరస్వామితోపాటు శ్రీదేవి, భూదేవి, పాంచాహ్నిక పంచకుండాత్మక విష్వక్సేనుడు, పంచముఖ హనుమాన్‌ విగ్రహాలను, ఆలయం ధ్వజస్తంభ శిఖరాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత, దైవ చింతనతో సమాజంలో దుర్మార్గాలు, అన్యాయాలు తగ్గుతాయన్నారు.  ప్రజలంతా సమానమనే భావన, సోదరభావం ఆలయాలతో పెంపొందుతుందని వివరించారు. ఆలయాల్లో జరిగే కార్యక్రమాలకు ఎవరూ పిలువకపోయినా హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ ఆలయ ప్రవేశం ఉండాలనేదే భగవత్‌ రామానుజుల ఉద్దేశమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ తాను చదువుకున్న నేల దుబ్బాకను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించి బాలాజీ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి భగవత్‌ సన్నిధిని ఏర్పాటు చేశారన్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు రావాలనే సంకల్పంతో గొప్పగా నిర్మించారని పేర్కొన్నారు. ప్రతీరోజు 20వేల మంది ఆలయానికి రావాలని, ఇక్కడ జరిగే గోష్టిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆలయం కళకళలాడినప్పుడే సమాజం కళకళలాడుతుందన్నారు.


శంషాబాద్‌లో అతిపెద్ద రామానుజ విగ్రహం

శంషాబాద్‌ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద యోగముద్రలో ఆసీనులైన స్వామి రామానుజుల పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు పిబ్రవరి 2 నుంచి 14 రోజుల పాటు నిర్వహిస్తామని వెల్లడించారు. లక్ష హోమకుండాలను ఏర్పాటుచేసి 2 లక్షల లీటర్ల ఆవు నెయ్యితో  హోమం నిర్వహిస్తున్నామన్నారు. లోక కల్యాణం కోసం చేపడుతున్న కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారని తెలియజేశారు. ఇందుకోసం రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి స్వచ్ఛమైన దేశీ ఆవుల నెయ్యిని సేకరిస్తున్నామని వివరించారు. 


ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ కృషి

దుబ్బాకలో బాలాజీ వేంకటేశ్వరాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆలయం నుంచి వచ్చే ఆదాయాన్ని ఇతర పనులకు మళ్లించేవారని, సీఎం కేసీఆర్‌ మాత్రం ఆలయాల నిర్మాణానికి, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టులకు ఆయా ప్రాంతాల్లో ప్రజలు కొలిచే దేవుళ్ల పేర్లనే పెట్టారన్నారు. భగవంతుడి ఆశీస్సులతోనే తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. గోదావరి జలాల రాకతో దుబ్బాకలో బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారుతాయన్నారు. దుబ్బాక అభివృద్ధి జరుగుతుందంటే సీఎం కేసీఆర్‌ కృషితోనేనన్నారు. ప్రభుత్వం నుంచే కాకుండా ఆయన స్వయంగా కోటి రూపాయలు అందజేశారని పేర్కొన్నారు.


పోలీసుల అత్యుత్సాహం

దేవాలయ కమిటీ నిర్వాకం, పోలీసుల ఆత్యుత్సాహంతో ఉత్సవాల్లో గందరగోళం ఏర్పడింది. వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అందజేసిన పాస్‌లు చెల్లవని పేర్కొంటూ భక్తులపై పోలీసులు దాడికి దిగారు. కేవలం దర్మకర్తలకే ప్రవేశం ఉందని, ఇతర దాతలను రానివ్వలేదు. ఆలయంలోకి ప్రవేశానికి ఆలయ కమిటీ జారీచేసిన డోనర్‌ పాస్‌ను చూపించినా యోగా గురువు దయాకర్‌ను మెడ పట్టుకుని బయటకు        నెట్టారు. బెజ్జంకి ఎస్‌ఐ చంద్రశేఖర్‌, దుబ్బాక ప్రోబేషనరీ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ భక్తులను దూషిస్తూ దాడిచేసి అవమానించారు. ఉత్సవాలను వీక్షించేందుకు వచ్చిన చిన్నపిల్లలను కూడా మెడ పట్టి బయటకునెట్టారు. ఆలయ ప్రవేశాన్ని కేవలం రెండు కుటుంబాలకే పరిమితం చేయడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు జారీచేసిన పాస్‌లు కూడా చెల్లవవని మీడియా ప్రతినిధులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటనల్లో ఎన్నడూ లేనివిధంగా మీడియా ప్రతినిధులను అవమానించారు. ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుకోవడంపై ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తీవ్ర ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలని దుబ్బాక మున్సిపల్‌ పాలక మండలి, దుబ్బాక మండల పరిషత్‌ సభ్యులు తీర్మానం చేయనున్నట్టు తెలిసింది.

Updated Date - 2021-08-21T06:04:59+05:30 IST