మాత్‌పల్లి శివారులో చాళుక్య శైలి ఆనవాళ్లు

ABN , First Publish Date - 2021-05-20T06:04:21+05:30 IST

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మాత్‌పల్లి శివారులో చాళుక్యుల శైలి ఆనవాళ్లను గుర్తించారు.

మాత్‌పల్లి శివారులో చాళుక్య శైలి ఆనవాళ్లు
రాతి గుండుపై చెక్కిన దేవతా విగ్రహాలు

కొండపాక, మే 19 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మాత్‌పల్లి శివారులో చాళుక్యుల శైలి ఆనవాళ్లను గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ మాత్‌పల్లి శివారులో గల రాతి గుండుకు చెక్కిన శిల్పాలను పరిశీలించి చారిత్రక ఆనవాళ్లను వెల్లడించారు. ఇక్కడ పెద్ద రాతి గుండుకు చెక్కిన గణపతి శిల్పాన్ని గుర్తించారు. ఈ గణపతి చతుర్భుజుడు. పైచేతుల్లో పరశువు, ఢమరుకాలు, కింది చేతుల్లో విరిగిన దంతం, మోదకాలతో లలితాసనంలో కూర్చుని ఉన్నాడు. కరండమకుటం, దండకడియాలు, కాళ్లకడియాలు, మెడలో హారం, ఉదరంపై నాగబంధంతో ఉన్నాడు. ఇది 10వ శతాబ్దపు చాళుక్యశైలి వినాయకుడుగా గుర్తించారు. ఇక్కడే రాతిగుండుకే చెక్కిన ఉత్తరాభిముఖుడైన భక్తాంజనేయుడున్నాడు. అతనికి ఎదురుగా చక్రం, శంఖులతో అభయ, వరదహస్తాలతో, వనమాలతో, మణిమకుటంతో, హార, గైవ్రేయకాలతో, పట్టువస్త్రాలతో, ఎత్తులు కట్టిన పావుకోళ్లతో రామనారాయణుడు, తనతో కుడిచేత పతాకం ధరించి, ఎడమచేయి ప్రసారిత హస్తంగా సీత, సీతకు ఎడమవైపున ఎడమచేతిలో ధను స్సు, బాణాలు ధరించిన లక్ష్మణమూర్తి కనిపిస్తున్నారు. చాళుక్యుల కాలంలో ఇలాంటివే ఉండేటివి అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-05-20T06:04:21+05:30 IST