కేంద్ర, రాష్ట్ర విధానాలపై తిరగబడాలి
ABN , First Publish Date - 2021-10-21T04:54:16+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతీ ఒక్కరు తిరగబడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

నిస్వార్థ సేవకుడు నారాయణరెడ్డి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
సంగారెడ్డిలో జిల్లా కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
సంగారెడ్డిరూరల్/సంగారెడ్డి అర్బన్, అక్టోబరు 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతీ ఒక్కరు తిరగబడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని మగ్దుంనగర్‌లో కామ్రేడ్ నారాయణరెడ్డి భవన(సీపీఐ జిల్లా కార్యాలయం) నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం టీఎన్‌జీవో్‌స భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన నారాయణరెడ్డి సీపీఐలో ఉంటూ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారని కొనియాడారు. పేదలకు స్థలాలను అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా సంగారెడ్డిలో 15 కాలనీలు ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయన్నారు. నారాయణరెడ్డి భవనం నిర్మించుకోవడం గర్వకారణమన్నారు. భవన నిర్మాణానికి దాతలు తోడ్పాటు అందించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని విమర్శించారు. దేశంలో ప్రజలు, కార్మికుల పొట్టకొట్టి బడాబాబులకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధరలు తగ్గే వరకు, వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునే వరకు పోరాటాలు ఆగవని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హత్యలు, అత్యాచారాలు పెరిగి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో పోడు భూములపై సీఎం కేసీఆర్ హెలికాప్టర్ సర్వే చేయడాన్ని చాడ వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ సర్కారు పేదల భూములను లాక్కుంటుందన్నారు. హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదని విమర్శించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలను, రేషన్ కార్డులను అందజేసేందుకు నిరంతరం శ్రమించిన మహనీయుడు నారాయణరెడ్డి అని కొనియాడారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గసభ్యుడు అజీజ్‌పాషా, సీపీఐ రాష్ట్ర ఉప కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి కూనంనేని సాంబశివరావు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్, మెదక్ జిల్లా కార్యదర్శి కాలిక్, బీదర్ జిల్లా కార్యదర్శి బాబురావు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి తదితరులు పాల్గొన్నారు.