రైతు వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2021-11-24T04:58:45+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించేది బాయిల్డ్‌రైస్‌ అయితే కేంద్ర ప్రభుత్వం రా రైస్‌ను కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల

రైతు వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్రం
మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

రైతాంగాన్ని చిన్నచూపు చూసేలా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

రైతులను కార్లతో తొక్కి చంపించే సంస్కృతి బీజేపీదే

రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు


మెదక్‌, నవంబరు 23: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించేది బాయిల్డ్‌రైస్‌ అయితే కేంద్ర ప్రభుత్వం రా రైస్‌ను కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల పేర్కొనడం రైతాంగాన్ని చిన్నచూపు చూడడమే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని అవలంభిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళవారం స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు కార్లతో తొక్కి చంపించే సంస్కృతి బీజేపీదని, వారిని ఉగ్రవాదులుగా పోల్చడం ఆ పార్టీకే తగిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వడ్లు తడిసి ముద్దయ్యాయని, వాటిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రా రైస్‌ సాధ్యపడదని, బాయిల్డ్‌ రైస్‌ను ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. మెదక్‌ జిల్లాలో పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే రైతుల నుంచి 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. మెదక్‌ జిల్లాలో మొత్తంలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండగా సుమారు 60 శాతం సేకరించినట్లు తెలిపారు.  

మండలి ఎన్నికల్లో గెలుపు తథ్యం

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి గెలుపు తథ్యమని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎ్‌సకు 777 మంది ఓటర్లు ఉన్నారని  కాంగ్రెస్‌, బీజేపీకి కలిపి 250 మంది ఉంటారని వివరించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 300 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ఎంతమంది నామినేషన్లు వేసినా తమకు ఇబ్బంది లేదని డిసెంబరు 10 తరువాత తేలిపోతుందన్నారు. ప్రస్తుతం మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఓటు హక్కు కల్పించడం టీఆర్‌ఎ్‌సకు ఇంకా లాభం చేకూరనుందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలను ఒక ప్రక్రియలాగానే చూస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-24T04:58:45+05:30 IST