డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-29T05:28:49+05:30 IST

సిద్దిపేటలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయంప్రతిపత్తిలో ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం 73వ ఎన్‌సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవం
గార్డ్‌ మౌంట్‌ ను ప్రారంభిస్తున్న ఏసీపీ దేవారెడ్డి

సిద్దిపేట  క్రైం, నవంబరు 28: సిద్దిపేటలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయంప్రతిపత్తిలో ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం 73వ ఎన్‌సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు.   కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట  ఏసీపీ దేవారెడ్డి హాజరై కళాశాలలో ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గార్డ్‌మౌంట్‌ వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ క్యాడెట్లు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కళాశాలలోని ఆడిటోరియంలో ఏసీపీ దేవారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో తాను ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఎంతో నేర్చుకున్నానని చెబుతూ ఎన్‌సీసీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్‌సీసీలో చేరడం వల్ల క్రమశిక్షణతో పాటు ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాల నుంచి  దూరంగా ఉంటూ సమాజంలో చెడును అరికట్టే బాధ్యత తీసుకోవాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ డా. సీహెచ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్‌సీసీతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.  కళాశాలలో గార్డ్‌ నిర్మాణానికి సహకరించిన వర్కింగ్‌ అల్మాని టీచర్స్‌ అసోసియేషన్‌ వాటా కార్యదర్శి డాక్టర్‌ అయోధ్య రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సీసీ విద్యార్థులు  సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.కె.హుస్సేన్‌, తెలుగు విభాగాధిపతి ఎస్‌.మహేందర్‌, ఎన్‌సీసీ కేర్‌ టేకర్‌ ఆర్‌.మహేందర్‌ రెడ్డి, అధ్యాపకులు, ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T05:28:49+05:30 IST