మల్లన్న భక్తులకు తిప్పలు
ABN , First Publish Date - 2021-03-22T05:20:14+05:30 IST
తెలంగాణ, జానపద సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఆదాయం ఏటేటా పెరుగుతున్నా కనీస వసతుల కల్పనకు నోచుకోక భక్తులు తిప్పలు పడుతున్నారు.

కొమురవెల్లిలో ఆచరణకు నోచుకోని అమాత్యుల హామీలు
ఆదాయం పెరుగుతున్నా కానరాని మౌలిక వసతుల కల్పన
బడ్జెట్ నిధులపైనే భక్తుల ఆశలు
చేర్యాల, మార్చి 21: తెలంగాణ, జానపద సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఆదాయం ఏటేటా పెరుగుతున్నా కనీస వసతుల కల్పనకు నోచుకోక భక్తులు తిప్పలు పడుతున్నారు. ఆలయ అభివృద్ధికి పాలకులిస్తున్న హామీలు కార్యరూపం దాల్చటం లేదు. కరోనా ప్రభావంలోనూ ఈ ఏడాది రూ.3 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చింది. బుకింగ్ ఆదాయం కూడా రికార్డుస్థాయిలో చేకూరింది. అయినా భక్తులు అరకొర సౌకర్యాల మధ్య ఇబ్బందులు పడక తప్పటం లేదు.
జారీకాని పట్టాదారు పాసుబుక్కుల
2014 డిసెంబరులో సీఎం కేసీఆర్ కొమురవెల్లి చుట్టుపక్కల ఉన్న 166.16 ఎకరాల ప్రభుత్వ భూములను మల్లన్న పేరిట పట్టా చేయాలని ఆదేశించారు. 131.09 ఎకరాల భూమికి పట్టా చేసినా మిగతా 35 భూమికి ఇంకా పట్టాదారు పాసుబుక్కులు రాలేదు. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.10 కోట్ల నిధులతో 50 గదుల సత్రం నిర్మాణం పనులు చేపట్టినా నత్తనడకన సాగుతున్నాయి. నూతన జిల్లాల ఏర్పాటులో కొమురవెల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసినా ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు సమకూర్చలేదు. దీంతో మల్లన్న ఆలయ గెస్ట్‌హౌజ్‌లలో ఎంపీడీవో, పోలీ్‌సస్టేషన్లు కొనసాగుతున్నాయి. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ అయినాపూర్, కొమురవెల్లి, గౌరాయపల్లి గ్రామాల శివారు మీదుగా నిర్మిస్తుండటంతో మల్లన్న ఆలయం ఉన్న కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మంత్రులు గెస్ట్‌హౌస్‌లు నిర్మిద్దామనుకున్నా..
మల్లన్నను ఇలవేల్పుగా కొలుస్తున్న మం త్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఎన్నోయేండ్లుగా జాతరకు కుటుంబసమేతంగా తరలివస్తారు. వసతి సౌకర్యం లేక దాతలు నిర్మించిన గదులలో బస చేస్తుంటారు. వారు గెస్ట్‌హౌస్‌లు నిర్మిస్తామని ముందుకొచ్చారు. దాసారంగుట్టపై గెస్ట్‌హౌజ్‌ల కోసం స్థలాన్ని నిర్ణయించినా అక్కడికి వెళ్లడానికి అప్రోచ్‌రోడ్డుకు రూ.6 కోట్ల కు పైగా నిధులు కావాలి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాక గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం మొదలుకాలేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే భక్తుల తిప్పలు తప్పనున్నాయి.