ఆదమరిస్తే అంతే..

ABN , First Publish Date - 2021-03-22T05:53:52+05:30 IST

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్‌ ముప్పు తొలగిపోయిందనే ధీమాతో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు మాస్కులు లేకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

ఆదమరిస్తే అంతే..
మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కూర్చున్న దృశ్యం

పెరుగుతున్న కేసులు.. కనిపించని జాగ్రత్తలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మార్చి 21: కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్‌ ముప్పు తొలగిపోయిందనే ధీమాతో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు మాస్కులు లేకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భౌతిక దూరం ఎక్కడా కనిపించడం లేదు. రద్దీ ప్రాంతాల్లో, బస్సుల్లోనూ మాస్కులు ధరించడం మానేశారు. చేతులను శుభ్రపరుచుకోవడం మరిచిపోయారు. ఆఫీసులు, వ్యాపార సంస్థలు, బస్సుల్లో శానిటైజర్‌ వినియోగం కనుమరుగైంది. చాలామంది జ్వరం, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతున్నా ఆసుపత్రులకు వెళ్లడం లేదు. కరోనా టెస్టులు చేయించుకోవడం లేదు. లక్షణాలున్నా యథేచ్ఛగా జనాల్లో కలిసిపోతున్నారు. ఆరోగ్య సమస్యలుంటే ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నారు.


జిల్లాలో 24 చోట్ల కొవిడ్‌ పరీక్షలు

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతీఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు విజ్ఙప్తి చేస్తున్నారు. జిల్లాలో 24 కేంద్రాల్లో ప్రతీరోజు ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. కానీ కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో పదివేల మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేశారు. ఇందులో 36 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 19వ తేదీ వరకు 5361 మందికి టెస్టులు నిర్వహించగా 21 మందికి పాజిటివ్‌ వచ్చింది. గత నెలతో పోలిస్తే మార్చి 19 వరకు కరోనా పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా పరీక్షల సంఖ్య తగ్గడం కలవరానికి గురిచేస్తున్నది.


ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు బంద్‌

మెదక్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న ఆర్టీసీపీఆర్‌ పరీక్షల యంత్రాన్ని నెల క్రితం తరలించారు. రివర్స్‌ ట్రాన్స్‌ స్ర్కిప్షన్‌ పాలిమరేజ్‌ రియాక్షన్‌ యంత్రం ద్వారా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడం ద్వారా కరోనా నిర్ధారణ కచ్చితంగా జరుగుతుంది. ప్రాథమిక నిర్ధారణ కోసం ముందుగా ర్యాపిడ్‌ టెస్టులు చేస్తారు. ర్యాపిడ్‌ టెస్టులో నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చినా కరోనా లక్షణాలు కొనసాగుతుంటే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసి నిర్ధారిస్తారు. వైర్‌సను కట్టడి చేయడం కోసం వీలైనంతవరకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచాలని కేంద్రం ఆదేశించింది. కానీ జిల్లాకేంద్ర ఆస్పత్రిలో ఉన్న ఒక్క ఆర్టీపీసీఆర్‌ యంత్రాన్ని కూడా తరలించడంతో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 24 సెంటర్లలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు మాత్రమే చేస్తున్నారు. 


కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

వైరస్‌ నుంచి రక్షణ కోసం వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. తొలి ప్రాధాన్యంగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన హెల్త్‌, పోలీసు, శానిటేషన్‌, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. ప్రస్తుతం 45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు టీకా ఇస్తున్నారు. కానీ వ్యాక్సినేషన్‌  చేయించుకోవడానికి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంతగా ఆసక్తి చూపడం లేదు. 60 ఏళ్ల పైబడిన వారు మాత్రం కొంత ఎక్కువ సంఖ్యలో టీకా తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-03-22T05:53:52+05:30 IST