అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వరా..?

ABN , First Publish Date - 2021-02-05T05:40:09+05:30 IST

తమకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు తమ వార్డుల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నారని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రాంసింగ్‌నాయక్‌, మయూరిరాజుగౌడ్‌ ఆరోపించారు.

అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వరా..?
సమస్యలను అడిషనల్‌ కలెక్టర్‌కు వివరిస్తున్న కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

అధికారులపై కౌన్సిలర్ల మండిపాటు

శ్మశాన వాటిక పనుల అడ్డగింత

సర్దిచెప్పిన అడిషనల్‌ కలెక్టర్‌ 

బోరుబావిని పూడుస్తూ షెడ్‌ నిర్మాణం చేపట్టడంపై రాజర్షిషా ఆగ్రహం

రామచంద్రాపురం, ఫిబ్రవరి 4 : తమకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు తమ వార్డుల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నారని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు రాంసింగ్‌నాయక్‌, మయూరిరాజుగౌడ్‌ ఆరోపించారు. గురువారం వార్డులో జరుగుతున్న శ్మశానవాటిక పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా, చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి మధ్యాహ్నం ఘటనా స్థలానికి చేరుకుని కౌన్సిలర్లతో మాట్లాడారు. గ్రామంలోని ఓ సామాజికవర్గం వారు అనుమతులు లేకుండా ప్రత్యేకంగా ఛితి మండపాన్ని ప్రభుత్వ భూమిలో నిర్మించినా అధికారులు అడ్డుకోకపోవడంతో సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఈ క్రమంలో ఇతరవర్గాల ప్రజలు కూడా సొంత నిధులతో ప్రత్యేకంగా శ్మశాన వాటికలు నిర్మించుకుంటామని, అనుమతి ఇవ్వాలని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు కమిషనర్‌ సమాధానమిస్తూ అందరి కోసం కడుతున్నామని నిర్మాణదారులు చెప్పారని అడిషనల్‌ కలెక్టర్‌కు వివరించారు. అయితే వారు ఛితి మండపంతో ఆగకుండా అంతిమ సంస్కారం అనంతరం చేపట్టే కార్యక్రమాల కోసం బోరుబావిని పూడుస్తూ షెడ్‌ నిర్మాణం చేపట్టారని కౌన్సిలర్లు తెలిపారు. ఈ నిర్మాణానికి కూడా ఎలాంటి అనుమతులు లేవన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.44 లక్షలు వెచ్చించి పనులు చేపడుతున్నా... తమకు సమాచారం ఇవ్వరా అంటూ అడిషనల్‌ కలెక్టర్‌తో అన్నారు. ఇదిలా ఉండగా బోరుబావిని పూడుస్తూ నిర్మాణం చేస్తుంటే ఏం చేస్తున్నారని ఏఈ సంజయ్‌పై రాజర్షిషా ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్‌ పనులు నిలిపేయాలని అధికారులకు ఆదేశిస్తున్న సమయంలోనే నిర్మాణదారులు పనులు చేపట్టడంపై అడిషనల్‌ కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు శుక్రవారం కౌన్సిలర్లు, ఛితి మండపం నిర్మించిన వారిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. 

జొన్నాడ రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి

కొల్లూరు నుంచి రంగారెడ్డి జిల్లా జొన్నాడ గేట్‌ వరకు గల రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కమిషనర్‌ వెంకటమణికరణ్‌కు అడిషనల్‌ కలెక్టర్‌ ఆదేశించారు. ఇది ఆర్‌అండ్‌బీ రోడ్డు కావడంతో మరమ్మతు చేపట్టడం లేదని ఏఈ చెప్పడంతో.. ఆర్‌అండ్‌బీ వద్ద నిధులు లేవు.. మున్సిపాలిటీ నిధులతోనే చేపట్టాలని చెప్పారు. 

Updated Date - 2021-02-05T05:40:09+05:30 IST