బడికి బైబై!
ABN , First Publish Date - 2021-03-25T05:28:28+05:30 IST
కరోనా నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థల నిర్వాహణకు మళ్లీ బ్రేక్ పడింది. వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు మళ్లీ బంద్
గురుకులాలు, హాస్టళ్లు ఖాళీ.. ఇంటిబాట పట్టిన విద్యార్థులు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 24: కరోనా నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థల నిర్వాహణకు మళ్లీ బ్రేక్ పడింది. వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మూసేయడంతో విద్యార్థులంతా తమ ఇళ్లకు పయనమయ్యారు. సిద్దిపేట జిల్లాలో 329 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 197 ప్రాథమికోన్నత పాఠశాలలల్లో 77,154 మంది విద్యార్థులు (6నుంచి10వ తరగతి వరకు) ఇటీవల తరగతులకు హాజరయ్యారు. 65 ఇంటర్ కాలేజీల్లో 23,477 మంది విద్యార్థులు, 28 డిగ్రీ కళాశాలల్లో 13,850 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలేజీలకు వెళ్తున్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు 7 నెలల పాటు కాలేజీలకు దూరమైన వీరు ప్రతీరోజు హాజరవుతూ త్వరలో జరగబోయే ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి కాలేజీలు, స్కూళ్లు మూసేయాలని నిర్ణయం తీసుకోవడం వీరంతో మళ్లీ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఆన్‌లైన్ పాఠాలు షురూ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మళ్లీ ఆన్‌లైన్ పాఠాలు మొదలయ్యాయి. టీశాట్, డీడీ ఛానళ్ల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. దాదాపు నెలన్నర రోజులు ప్రత్యక్ష తరగతులకు హాజరై మళ్లీ ఆన్‌లైన్ పాఠాలకు పరిమితం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో పడుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల నిర్వాహకులు సైతం ఆన్‌లైన్ క్లాసుల దిశగా చర్యలు చేపట్టారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఇంకా పాఠాలు మొదలు పెట్టలేదు.
తాత్కాలికమా.. శాశ్వతమా!
విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఇప్పట్లో తిరిగి ప్రారంభించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడే లాక్‌డౌన్ విధించి మధ్యలోనే తరగతులన్నీ నిలిపివేశారు. ప్రస్తుతం మళ్లీ కేసులు ప్రబలుతున్నాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవడానికి రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. సాధారణంగా ఏప్రిల్ నెలలోనే వేసవి సెలవులు ఇచ్చేస్తుంటారు. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది మరో నెల రోజులు తరగతుల నిర్వహణను పొడిగించారు. కానీ ప్రస్తుత పరిస్తితుల దృష్ట్యా తరగతుల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తారని, లేదంటే అందరినీ పై తరగతులకు పంపిస్తారని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. జూన్ నెల వరకు విద్యాసంస్థలను తెరిచే అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
ఇంటిదారి పట్టిన విద్యార్థులు
సంగారెడ్డి టౌన్, మార్చి 24 : కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలను మూసివేయాలని సర్కారు నిర్ణయించడంతో విద్యార్థులు ఇంటిదారి పట్టారు. ఫిబ్రవరి 1వ తేదీన పునర్ ప్రారంభమైన విద్యాసంస్థలు 50 రోజుల పాటు కొనసాగాయి. కరోనా కేసులు పెరుగుతుండడం, ఇటీవల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సర్కార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, హాస్టళ్లు మూసివేయడంతో పట్టణాల నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. మొదట్లో కరోనా వైరస్ కారణంగా 2020 మార్చి 19 నుంచి దాదాపు పది నెలల పాటు విద్యాసంస్థలను మూసి వేసిన విషయం తెలిసిందే. వైరస్ తగ్గుముఖం పట్టిందన్న ఉద్దేశంతో 2021 ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులతో పాటు, కళాశాలలు, పాఠశాలలను పునప్రారంభించారు. పాఠశాలల్లో పది నెలల పాటు ఆన్‌లైన్ ద్వారా అరకొర విద్యాబోధన సాగా, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మెళ్ల మెళ్లగా విద్యాబోధన గాడిలో పడుతున్నది. ఈ సమయంలో విద్యాసంస్థలను మళ్లీ మూసివేయాని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యాబోధన ప్రశ్నార్థకంగా మారింది. వార్షిక పరీక్షల నిర్వహణపైనా సంగ్ధిత నెలకొన్నది.