తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా
ABN , First Publish Date - 2021-10-26T05:10:48+05:30 IST
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నర్సింహులు పేర్కొన్నారు.

త్వరలో పార్టీ సభ్యత్వాల సేకరణ
సమస్యలపై ప్రజల తరఫున పోరాటం
కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నర్సింహులు
సంగారెడ్డిటౌన్, అక్టోబరు25: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నర్సింహులు పేర్కొన్నారు. సంగారెడ్డిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఇల్లెందుల రమేష్ అధ్యక్షతన జరిగిన నేతల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రంలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తానన్నారు. అందులో భాగంగానే త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ తరఫున గెలిచిన నేతలు తమ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌లో చేరారని, నేతలు మారినా గ్రామాల్లో పార్టీ క్యాడర్ బలంగానే ఉన్నదని తెలిపారు. సభ్యత్వ నమోదు ద్వారా గ్రామాల్లో నాయకత్వాన్ని పెంచుకుంటామని వివరించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన, నియంత పాలన సాగుతున్నదని విమర్శించారు. కేసీఆర్ దురహంకార పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేకపోయారని, ప్రజలను మోసగించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై పోరాటం సాగిస్తానని బక్కిని నర్సింహులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా గుర్తింపు వచ్చిందన్నారు. సమావేశంలో మెదక్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ఇల్లెందుల రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.కె.గంగాధర్‌రావు, జడ్పీ మాజీ చైర్మన్ ఆర్.శ్రీనివాస్ గౌడ్, నాయకులు మల్లారెడ్డి, సత్యనారాయణ, ఎండి కాజా, వివి నర్సింలు, బందెన్నగౌడ్, నరేందర్ చక్రవర్తిగౌడ్, నగేశ్, కృష్ణ, భాస్కర్ రెడ్డి, ఆకుల రాములు, బాలరాజు, అశోక్‌గుప్తా, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.