వంతెనలను నిర్మించాలి

ABN , First Publish Date - 2021-09-04T03:48:50+05:30 IST

ఇటీవల కురిసిన భారీవర్షాలకు కోహెడ మండలం శనిగరం-తంగళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న పిల్లివాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. హుజురాబాద్‌, కోహెడ మీదుగా శనిగరం రాజీవ్‌ రహదారిపై వెళ్లే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వంతెనలను నిర్మించాలి
తంగళ్లపల్లి పిల్లివాగుపై కొట్టుకుపోయిన కాజ్‌వే

 వర్షాలకు తెగిపోయిన కాజ్‌వేలు

 పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

 శనిగరంలో నిలిచిన రాకపోకలు


కోహెడ, సెప్టెంబరు 3: ఇటీవల కురిసిన భారీవర్షాలకు  కోహెడ మండలం శనిగరం-తంగళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న పిల్లివాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. హుజురాబాద్‌, కోహెడ మీదుగా శనిగరం రాజీవ్‌ రహదారిపై వెళ్లే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. మండల కేంద్రానికి వెళ్లాలంటే శనిగరం, శంకర్‌నగర్‌ గ్రామస్థులకు ఇదే ప్రధాన దారి. కాజ్‌వే (వంతెన) వర్షాలకు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచి ఇబ్బందులు పడుతున్నారు. బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌, రామచంద్రాపూర్‌, వింజపల్లి మీదుగా మండల కేంద్రానికి వెళ్తున్నారు. దీంతో సుమారు పది కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. 


వంతెనను నిర్మిస్తాం


శనిగరం-తంగళ్లపల్లి గ్రామాల మధ్య పిల్లివాగుపై కొట్టుకుపోయిన వంతెనను పున:నిర్మిమిస్తామని రోడ్డు భవనాల శాఖకు చెందిన ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఈఈ రామకృష్ణ తెలిపారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత తాత్కాలిక మరమ్మతులు చేసి రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతామని వివరించారు. 
కడవేర్గులో సీపీఎం నాయకుల ఆందోళన


చేర్యాల, సెప్టెంబరు 3: కడవేర్గు రోడ్డుపై వంతెన నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సీపీఎం మండల కమిటీ సభ్యుడు మోకు దేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో వంతెనపై నిరసన చేపట్టారు. వరద ప్రవాహంతో చేర్యాల నుంచి కడవేర్గు మీదుగా యాదాద్రికి వెళ్లే రహదారిలో కల్వర్టు పూర్తిగా ధ్వంసమైందన్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గొర్రె శ్రీనివాస్‌, నాయకులు సత్తయ్య, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


 

Updated Date - 2021-09-04T03:48:50+05:30 IST