ఉపాధ్యాయులకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2021-01-13T06:07:57+05:30 IST

ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

ఉపాధ్యాయులకు అండగా ఉంటా
కోహెడలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న బండి సంజయ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ 


సిద్దిపేట ఎడ్యుకేషన్‌, జనవరి 12: ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌ ) జిల్లా డైరీని మంగళవారం ఆయన సిద్దిపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మూడేళ్లుగా పీఆర్సీ ప్రకటించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. పదోన్నతులు కల్పించడంలోనూ తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పదోన్నతులు కల్పించడం ద్వారా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉపాధ్యాయులు సమాజాన్ని చైతన్యం చేయడంలోనూ ముందుండాలని కోరారు. వివేకానందుడి బాటలో విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించి ఉత్తమ పౌరులుగా  తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతి, రఘువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నవీన్‌, రవీందర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, జగన్‌, సంతోష్‌, శివకుమార్‌, భాస్కర్‌రెడ్డి, శ్రీను, జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


బండి సంజయ్‌కి ఘన స్వాగతం

కోహెడ, జనవరి 12: మండల పరిధిలోని సముద్రాల గ్రామంలో వెలసిన వీరభద్రస్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ మంగళవారం దర్శించుకున్నారు. అంతకుముందు ఆయన కోహెడలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. కోహెడ నుంచి సముద్రాల వరకు యువత భారీ ర్యాలీ నిర్వహించారు. సముద్రాలలో పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. పార్టీలో చేరిన ఉప సర్పంచ్‌ వంగర ముకుందరెడ్డితో పాటు పలువురు నాయకులను పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వీరభద్ర స్వామి ఆలయంలో అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని దర్శించుకున్న సంజయ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివా్‌సరెడ్డి, మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, ఎంపీటీసీలు స్వరూప, సురేందర్‌, సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రామ్‌గోపాల్‌రెడ్డి, అశోక్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణరెడ్డి, నర్సయ్య, రమేష్‌, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T06:07:57+05:30 IST