లక్ష్యాన్ని మించి..

ABN , First Publish Date - 2021-01-20T06:19:50+05:30 IST

మెదక్‌, జనవరి 19: తెలంగాణ సర్కారు ఆదేశాలతో మెదక్‌ జిల్లాలో ఈసారి లక్ష్యాన్ని మించి కందిపంట సాగయింది. 8,795 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది.

లక్ష్యాన్ని మించి..

 మెదక్‌ జిల్లాలో 8,795 మెట్రిక్‌ టన్నుల కందుల దిగుబడి

 వెయ్యి మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకే ప్రభుత్వ కసరత్తు

 కొనుగోలు కోటాను పెంచాలని రైతుల వేడుకోలు

 జిల్లాలో మూడుచోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం


 మెదక్‌, జనవరి 19:  తెలంగాణ సర్కారు ఆదేశాలతో మెదక్‌ జిల్లాలో ఈసారి లక్ష్యాన్ని మించి కందిపంట సాగయింది. 8,795  మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది.  మరో పక్షం రోజుల్లో కందుల కొనుగోళ్లు ప్రారంభం  కానున్నాయి. జిల్లాలో మార్క్‌ఫెడ్‌ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా ముమ్మరం చేస్తున్నారు. అయితే మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెయ్యి మెట్రిక్‌ టన్నులే  సేకరించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడం  రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నది. మిగతా కందులను ఎవరు కొంటారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో అంతర పంటగా రైతులు కందిని అధికంగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్‌, నిజాంపేట, నర్సాపూర్‌, శివ్వంపేట రైతులు కందిపంటను సాగుచేశారు. గతసంవత్సరం సుమారు 8 వేల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి రెట్టింపునకు పైగా.. 17,759 ఎకరాల్లో సాగు చేశారు. 


జిల్లాలో వెయ్యి మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకే అనుమతి

కంది లాభదాయకంగా ఉంటుందనే అంచనాతో నియంత్రితసాగులో భాగంగా జిల్లా రైతులు అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. ఈ తరుణంలో ప్రభుత్వ కొనుగోలు నిబంధనలు రైతులకు ఇబ్బందికంగా మారాయి. 17,750 ఎకరాల్లో రైతులు కందిపంటను సాగుచేయగా 8,795 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చింది. జిల్లాలోని మెదక్‌, చేగుంట, నర్సాపూర్‌లో కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం వెయ్యి మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొన్నది. నెలరోజుల క్రితం ఓపెన్‌ మార్కెట్‌లో క్వింటాలు  కందులు రూ.7వేల వరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే తరుణంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తక్కువ ధరకు అమ్మేలా దళారులు కుట్రలు పన్నుతారని రైతులు ఆందోళన చెందుతున్నారు. కందుల కొనుగోలు కోటాను పెంచాలని వారు వేడుకుంటున్నారు. గతేడాది ప్రారంభంలో కందులను తక్కువగానే కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ రైతులు ఆందోళన చేయడంతో రాష్ట్ర సర్కారు దిగొచ్చి రైతులకు ఊరట కల్పించింది. ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ సూచనతో పండించిన కందులన్నింటినీ కొనుగోలు చేయాల్సిందిగా రైతులు విజ్ఙప్తి చేస్తున్నారు. 


జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

-న ర్సింహారావు, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌

కంది పంట ఈ ఏడాది జిల్లాలో విస్తారంగా పండింది. పంటను కొనుగోలు చేసేందుకు మెదక్‌తో పాటు నర్సాపూర్‌, చేగుంటలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నిర్ధేశిత మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రైతులు తా ము పండించిన పంటనంతా విక్రయించకుండా ఇంటి అవసరాల నిమిత్తం కూడా ఉంచుకోవాలి.

Updated Date - 2021-01-20T06:19:50+05:30 IST