పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2021-10-02T05:14:17+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ చైర్మన్‌లు, కౌన్సిలర్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా అధికారులు, మున్సిపల్‌, పంచాయతీ అధికారులతో శుక్రవారం హైదారాబాద్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.

పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలి

నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం

మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి

బతుకమ్మ, దసరా వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట సిటీ, అక్టోబరు 1 : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ చైర్మన్‌లు, కౌన్సిలర్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా అధికారులు, మున్సిపల్‌, పంచాయతీ అధికారులతో శుక్రవారం హైదారాబాద్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు బతుకమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన తెల్లరేషన్‌ కార్డులో నమోదైన మహిళలు 3.80 లక్షల మంది ఉండగా ఇప్పటివరకు జిల్లాకు 2.88 లక్షల చీరలు వచ్చాయని తెలిపారు. మిగతా చీరలు రెండు రోజుల్లో జిల్లాకు వస్తాయన్నారు. మహిళలు మెచ్చేలా 19 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 రకాల్లో చూడచక్కగా బతుకమ్మ చీరలు ఉన్నాయన్నారు. రేపటి నుంచి కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగేలా చూడాలన్నారు. మూడు రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.

అధిక వర్షాలతో జలాశయాలు, చెర్వులు నిండుకుండలను తలపిస్తున్న నేపథ్యంలో బతుకమ్మలను నిమజ్జనం చేసే  జలశాయల వద్ద బారికేడ్లతో తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో పరిశుభ్ర కార్యక్రమాలను పండుగ ముగిసే వరకూ చేపట్టలన్నారు. విద్యుత్‌ లైట్‌లను ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల అలుగులపై పేరుకుపోయిన పాకురు, నాచుతో ప్రజలు జారిపడే అవకాశం ఉన్న దృష్ట్యా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో జలాశయాల అలుగులలోని పాకురు, నాచును తొలగించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ చైర్మన్‌, మున్సిపల్‌ కమిషనర్‌లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ, సర్పంచ్‌, కార్యదర్శిలు వేడుకల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. పో లీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వేడుకల్లో అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  

అన్ని గ్రామాలు, పట్టణాల్లో కరోనా వాక్సినేషన్‌ను వందశాతం పూర్తి చేసేలా చూడాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. వందశాతం పూర్తయిన గ్రామాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువును జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీష్‌ కుమార్‌తో కలిసి సందర్శించి పెండింగ్‌ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించి పెండింగ్‌ పనుల పూర్తిపై ఇంజనీరింగ్‌ అధికారులు, గుత్తేదార్లతో కలిసి చర్చించాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేకు మంత్రి సూచించారు.


Updated Date - 2021-10-02T05:14:17+05:30 IST