జిల్లా ఆస్పత్రిలో బాలింత మృతి
ABN , First Publish Date - 2021-01-20T06:58:01+05:30 IST
జిల్లా ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓ బాలింత మృతి చెందింది.

వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆరోపణ
వైద్యులు, సిబ్బందిపై దాడి
కార్డియో అరెస్టుతో మృతి చెందినట్లు ఆస్పత్రివర్గాల వెల్లడి
సంగారెడ్డి అర్బన్, జనవరి 19: జిల్లా ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓ బాలింత మృతి చెందింది. కుటుంబసభ్యులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన శిరీష(21) తొలి ప్రసవం కోసం సోమవారం జిల్లా ఆస్పత్రిలో చేరింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు వైద్యులు నార్మల్ డెలివరీ చేయగా మగశిశువు జన్మించాడు. అనంతరం వారిని వార్డుకు తరలించారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బాలింత శిరీషలో చలనం లేకపోవడంతో హుటాహుటిన ఎంఐసీయూలోకి తరలించారు. ఊపిరాడక కొద్ది సేపటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలింత శిరీష మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ అందుబాటులో లేదని, చివరి క్షణంలో ప్రైవేటుకు తీసుకెళ్తామని వైద్యులకు చెప్పినా వారు వినలేదని ఆరోపించారు. కాపాడే ప్రయత్నం చేస్తున్నామంటూ శిరీషను తమకు అప్పగించకుండా వైద్యులు నిర్లక్ష్యం చేశారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వెంకటేశ్ ఆస్పత్రికి చేరుకొని ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులకు సర్దిచెప్పారు. కాగా బాలింత శిరీషను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కుటుంబసభ్యులు అక్కడే ఉన్న ముగ్గురు వైద్యులతో పాటు వార్డ్‌బాయ్స్‌పై చేయి చేసుకున్నారని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారని వాపోయాడు.
పల్మనరి ఎంబాలిజం వల్లే మృతి: ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి
పల్మనరి ఎంబాలిజం వల్లే శిరీష మృతి చెందింది. ఇలాంటి మృతి కేసు వేయి మందిలో ఒకరికి వస్తుంది. ప్రసవానంతరం కొన్ని గంటల పాటు బాలింతకు ఏ ఆహార పదార్థాలూ ఇవ్వకూడదు. అయితే కుటుంబసభ్యులు నీరు, టీ, బ్రెడ్ ఇవ్వడంతో ఊపిరాడక ఆస్పిరేట్ జరిగి కార్డియో అరెస్టుతో శిరీష చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నాం.