నేడు టీబీపై అవగాహనా సదస్సులు

ABN , First Publish Date - 2021-03-24T05:46:11+05:30 IST

ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు.

నేడు టీబీపై అవగాహనా సదస్సులు

సిద్దిపేట, మార్చి 23 : ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా ర్యాలీలు తీయడం లేదని చెప్పారు. సిద్దిపేటలోని ఐఎంఏ హాలులో వైద్య ఉద్యోగులు, సిబ్బందికి అవగాహనా సదస్స నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో గతేడాది క్రియాశీలకంగా పనిచేసిన సిబ్బందిని, టీబీ ఛాంపియన్‌ను సత్కరించనున్నట్లు చెప్పారు. లక్ష జనాభాకు 211 కేసులు ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నదన్నారు. జిల్లాలో 11 లక్షల జనాభా ఉండగా, 2020లో 2025 టీబీ కేసులు నమోదైనట్లు తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం పోషణ్‌ అభియాన్‌ కింద నెలకు రూ.500 అందజేస్తున్నదన్నారు. సాధారణ కేసులకు ఆరునెలల చికిత్స కాలం, ఇతరులకు 9 నెలల నుంచి రెండేళ్ల వరకు నెలకు రూ.500 చొప్పున వారి ఖాతాల్లో జమచేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఈ విధంగా 1680 మంది లబ్ధిపొందుతున్నట్లు చెప్పారు. 

జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలు 

జిల్లా కేంద్రం సిద్దిపేటలో సీబీనాట్‌ యంత్రం ద్వారా, గజ్వేల్‌లోని జిల్లా ఆస్పత్రిలో ట్రునాట్‌ యంత్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తుండగా, మిగిలిన ఆరు కేంద్రాలలో మైక్రోస్కోప్‌ ద్వారా తెమడ పరీక్షలు చేస్తున్నట్లు డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఈ పరీక్షల ద్వారా తేలికపాటి టీబీ, మొండి వ్యాధి టీబీలను గుర్తించి చికిత్స అందిస్తారని వెల్లడించారు. రెండు వారాల నుంచి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలుంటే సమీపంలోని పీహెచ్‌సీలో తెమడ పరీక్ష చేయించుకోవాలని కోరారు. 

Updated Date - 2021-03-24T05:46:11+05:30 IST