చేతులు మారుతున్న అసైన్డ్‌ భూమి!

ABN , First Publish Date - 2021-05-11T05:51:42+05:30 IST

అది నిరుపేద దళితులకు ప్రభుత్వం అందించిన అసైన్డ్‌ భూమి.. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దళారీ ప్రవేశించాడు. తక్కువ ధరకు ఆభూమిని చేజిక్కించుకున్నాడు. దానిని ప్రైవేటు భూమిగా నమ్మించి అమాయకులకు అంటగట్టాడు. ఆ మోసం తెలిసే లోపు ఒకరి నుంచి ఇంకొకరికి, వారి నుంచి మరొకరి చేతులు మార్చాడు. అధికారులకు చేతులు తడిచాయి.. దళారీ అందినకాడికి దండుకున్నాడు.. కానీ అమాయకులు మాత్రం బలవుతూనే ఉన్నారు. ఇదీ దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో వెలుగు చూసిన అసైన్డ్‌ భూమి రిజిస్ట్రేషన్‌ వ్యవహారం.

చేతులు మారుతున్న అసైన్డ్‌ భూమి!
పట్టా భూమిగా నిర్ధారిస్తూ పాస్‌బుక్కును జారీ చేసిన అధికారులు

ధరణి రికార్డుల్లో పట్టాగా మార్పు

ప్రైవేటు భూమిగా నమ్మించి అమ్మిన దళారి 

కొని మోసపోయిన అమాయకులు


దుబ్బాక, మే 10 : అది నిరుపేద దళితులకు ప్రభుత్వం అందించిన అసైన్డ్‌ భూమి.. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దళారీ ప్రవేశించాడు. తక్కువ ధరకు ఆభూమిని చేజిక్కించుకున్నాడు. దానిని ప్రైవేటు భూమిగా నమ్మించి అమాయకులకు అంటగట్టాడు. ఆ మోసం తెలిసే లోపు ఒకరి నుంచి ఇంకొకరికి, వారి నుంచి మరొకరి చేతులు మార్చాడు.  అధికారులకు చేతులు తడిచాయి.. దళారీ అందినకాడికి దండుకున్నాడు.. కానీ అమాయకులు మాత్రం బలవుతూనే ఉన్నారు. ఇదీ దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామంలో వెలుగు చూసిన అసైన్డ్‌ భూమి రిజిస్ట్రేషన్‌ వ్యవహారం. 

ఎనగుర్తి గ్రామంలో 41, 43 సర్వే నంబరులో అసైన్‌ట భూమి ఉంది. 41 సర్వే నంబరులో ఐదెకరాల 11 గుంటలు, 43లో రెండెకరాల 29 గుంటలు భూమి ఉన్నది. అందులో 41/ఆలో ఎకరా రెండు గుంటలు, 43 సర్వే నంబరులోని రెండెకరాల 29 గుంటల భూమిని ముగ్గురు నిరుపేద రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే నిరక్ష్యరాసులైన ఆ నిరుపేద రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అదే గ్రామానికి చెందిన ఒక వ్యాపారి ఆ భూమిపై కన్నేశాడు. రూ.15 వేలకు ఎకరా చొప్పున కొనుగోలు చేసి, అందులో తనపేరు చిక్కకుండా మరొకరికి బేరం పెట్టారు. ఆ భూమిని సుమారు లక్షా యాబైవేలకు ఎకరా చొప్పున సదరు దళిత రైతు నుంచి మరొకరి పేరు మీదకు మార్చారు. రియల్‌ వ్యాపారంలో ఆరి తేరిన అతడు తనకున్న పరిచయాలతో ఆ భూమిని పట్టాగా మార్చేశాడు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారులకు కొంత ముట్టజెప్పి ముగ్గురు రైతుల నుంచి 2006లో సాజత్‌ అలీఖాన్‌కు మధ్యవర్తిగా రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఆ భూమి వ్యవహారం తెలిసే లోపు మరో మహిళ సహారా సుల్తానాకు 2007లో రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఆమె కూడా నిలదీయడంతో హైదరాబాద్‌కు చెందిన నజీమా బుకారికి తిరిగి అమ్మించాడు. ఇటీవలే నజీమా బుకారికి కూడా పాస్‌బుక్కు ప్రభుత్వం అందజేసింది. అయితే తీరా భూములను సర్వే చేసిన అధికారులు 41, 43 సర్వే నంబర్‌లోనివి అసైన్డ్‌ భూమిగా తేల్చడంతో సదరు వ్యక్తి అయోమయానికి గురైంది. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి, తనకు జరిగిన మోసాన్ని ఏకరువు పెట్టింది. తాను హైదరాబాద్‌లో పైసాపైసా కూడబెట్టిన డబ్బుతో భూమిని కొనుగోలు చేశానని, అధికారులు, దళారీ మోసంతో తాను నిండా నష్టపోయానని సదరు బాధితురాలు వాపోయింది. 


ఎమ్మెల్యే అనుచరుడిగా...

2006లో అసైన్డ్‌ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కొనసాగారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరుడిగా చలామణి అయిన సదరు వ్యక్తి అధికారులపై అన్ని శక్తులు ఉపయోగించి, ప్రభుత్వ భూములను తన చేతికి మట్టి అంటకుండా మార్చారనే ఆరోపణలున్నాయి. సదరు వ్యాపారి రామలింగారెడ్డి చనిపోయే వరకు ఆయనకు బినామీగా చలామణి అయ్యారు. 2018లో ప్రభుత్వ భూమికి పట్టాగా నజీమా బుకారీకి పాస్‌బుక్కును కూడా ఇప్పించాడు. ఎనగుర్తి గ్రామంలోనే ఇలాగే మరో భూమికి ఎసరు పెట్టాడు. 65 సర్వే నంబరులోని ఓ వ్యక్తి భూమిని కొనుగోలు చేసి దానిపై కూడా పట్టా పొందడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో ఆ భూమి మార్పిడి జరగకపోవడంతో తిరిగి ఇచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం.


ఆన్‌లైన్‌లో ఇంకా పట్టాగానే

41, 43 సర్వే నంబరులలో ఉన్న ప్రభుత్వ భూమి అని తహసీల్దార్‌ తేల్చి చెప్పినా కూడా ఇప్పటికీ ధరణిలో మాత్రం పట్టాగానే నమోదైంది. తహసీల్దార్‌ సదరు భూమి రికార్డులను పరిశీలించి సుమారు నాలుగు నెలలు గడిచినా తిరిగి పట్టాగానే కనిపించడంతో మరో మోసానికి తెరతీసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. 


నిందితులపై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ భూమిని అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్య తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు, దళారుల ప్రమేయాన్ని విచారించాలి. అన్యాక్రాంతమైన దళితుల భూములను తిరిగి వారికి ఇవ్వాలి. దుబ్బాక మండలంలో వెట్టికార్మికుల భూమి, అసైన్డ్‌, దళితులకు, బహుజనులకు అందించిన భూమిపై సమగ్ర సర్వే నిర్వహించాలి. అన్యాక్రాంతమైన భూములను స్వాధీన పరుచుకుని తిరిగి దళిత అట్టడుగు వర్గాలకు అప్పగించాలి. భూమి విలువ పెరగడంతో అమాయకులను మోసం చేసి, ఆక్రమించుకుంటూ, వ్యాపారం చేసే రియల్‌ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. అసైన్ట్‌ భూములను అమ్మడం, కొనడం చట్టవిరుద్దంగా ఉన్నప్పటికీ  దళారుల అమాయకులను మోసం చేసి అమ్మడంపై విచారణ చేపట్టాలి. 

-శంకర్‌,  దళిత  బహజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి



Updated Date - 2021-05-11T05:51:42+05:30 IST