చలో అసెంబ్లీకి వెళ్తున్న నాయకుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-25T05:26:48+05:30 IST
గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన చలో అసెంబ్లీకి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హుస్నాబాద్, మార్చి 24 : గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన చలో అసెంబ్లీకి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఎన్నో సంవత్సరాల కిందట చేపట్టిన గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లు పూర్తి కావడం లేదని మండిపడ్డారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్‌ను కలుపవద్దని ఆనాడు పోరాటాలు చేసినందుకే నేడు ఇక్కడి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు. ఈ రిజర్వాయర్లను పూర్తి చేయకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఇక్కడి నుంచి చలో అసెంబ్లీకి వెళ్లకుండా హుస్నాబాద్ పోలీసులు నాయకులను అరెస్ట్ చేశారు.
అక్కన్నపేట: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య అన్నారు. బుధవారం చలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నాయకులను రామవరం గ్రామ శివారులో పోలీసులు అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.