కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయాలి
ABN , First Publish Date - 2021-01-13T04:59:27+05:30 IST
ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో మొదటి దశ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు.

అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
సిద్దిపేట సిటీ, జనవరి 12 : ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో మొదటి దశ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 16న వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు మార్గదర్శనం మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. రెండు జిల్లాల్లో తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు వందశాతం వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ పంపిణీ సజావుగా జరిగేలా చూసేందుకు జిల్లా ఆస్పత్రికి అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్, ఆర్‌వీఎం ఆస్పత్రికి అదనపు కలెక్టర్ ఎస్.పద్మాకర్, గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి డీఆర్డీవో గోపాల్‌రావు, మెదక్ ఆస్పత్రికి డీపీవో, నర్సాపూర్ ఆస్పత్రికి డీఆర్డీవోలను బాధ్యులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ చేసే కేంద్రాల్లో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీఈలు, సర్పంచులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ అధికారులు కేంద్రంలోనే ఉండాలని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన క్షేత్రస్థాయి రిపోర్టులను సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు పంపాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి చెప్పారు.