మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2021-11-10T05:19:32+05:30 IST

జిల్లాలో నూతన మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్‌ వెలువడిందని జిల్లా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ విజయభాస్కర్‌ తెలియజేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 70 మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటికి అదనంగా 23 దుకాణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు.

మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

ఈ నెల 18 వరకు గడువు, 20న కలెక్టర్ల సమక్షంలో లాటరీ

 దరఖాస్తు రుసుం రూ. 2 లక్షలు, బ్యాంకు గ్యారంటీ 25 శాతం


సిద్దిపేట క్రైం, నవంబరు 9 : జిల్లాలో నూతన మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్‌ వెలువడిందని జిల్లా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ విజయభాస్కర్‌ తెలియజేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 70 మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటికి అదనంగా 23 దుకాణాలను ప్రభుత్వం మంజూరు  చేసిందని వెల్లడించారు. ప్రభుత్వ నిర్వణయంమేరకు గౌడ కులస్థులకు 16, ఎస్సీలకు 9, జనరల్‌ కోటాకింద 68 దుకాణాలు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. గతంలో ఒక వ్యక్తి ఒకే దుకాణానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉండేదని, ప్రస్తుతం ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని, ఈ నెల 18 వరకు గడువు ఉన్నట్టు వెల్లడించారు. సిద్దిపేట పట్టణం విపంచి ఆడిటోరియంలో ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఆసక్తి కలిగిన వ్యక్తులు నిర్ణీత రుసం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 


రూ. 5 లక్షలు అదనంగా చెల్లిస్తే వాక్‌ఇన్‌ స్టోర్‌ వైన్స్‌

సంగారెడ్డి టౌన్‌, నవంబరు 9 : మద్యం దుకాణాలను దక్కించుకున్నవారు లైసెన్సు ఫీజుకు అదనంగా రూ. 5 లక్షలు చెల్లిస్తే వాక్‌ఇన్‌స్టోర్‌ (సూపర్‌ మార్కెట్‌) మద్యం దుకాణాలకు అనుమతులిస్తామని ఉమ్మడి జిల్లా ఆబ్కారీ శాఖ డిప్యూటి కమిషనర్‌ కేఏబీశాస్త్రి తెలిపారు. సంగారెడ్డిలోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2021 నుంచి 2023 నవంబర్‌ 30 వరకు నూతన మద్యం పాలసీ అమలులో ఉంటుందన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 242 మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నామని తెలిపారు. గౌడ కులస్తులకు 34, ఎస్సీలకు 28, ఎస్టీలకు 3 దుకాణాలు రిజర్వ్‌ చేశామని, 178 దుకాణాలకు జనరల్‌కు కేటగిరిలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. ఈ నెల 20న కలెక్టర్ల సమక్షంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగినవారు రూ.2 లక్షల నాన్‌రీఫండింగ్‌ ఫీజును డీడీ లేదా చలానా రూపంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దుకాణాలను దక్కించుకున్నవారు రెండు నెలలకోసారి (12 వాయిదాల్లో) చొప్పున లైసెన్సు ఫీజును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో 50 శాతం బ్యాంక్‌ గ్యారంటీ ఉండేదనీ, ఈ సారి కేవలం బ్యాంక్‌ గ్యారంటీ 25 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. తొలిరోజైన మంగళవారం ఉమ్మడి జిల్లాలో 5 దరఖాస్తులు అందాయన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2, సిద్దిపేట జిల్లాలో 2, మెదక్‌ జిల్లాలో 1 దరఖాస్తు వచ్చాయని తెలిపారు. సంగారెడ్డికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గాయత్రి, సీఐ మధుబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T05:19:32+05:30 IST