సిద్దిపేటలో మరో అద్భుతఘట్టం

ABN , First Publish Date - 2021-12-20T05:28:10+05:30 IST

మున్సిపాలిటీల్లో సేకరించే తడిచెత్తతో బయోగ్యాస్‌ తయారుచేసే మొదటి ప్లాంటు బెంగళూరు నగరంలో ఉంది. రెండవ ప్లాంటును సిద్దిపేట పట్టణశివారులోని బుస్సాపూర్‌ డంపుయార్డు వద్ద ఏర్పాటు చేయడం విశేషం.

సిద్దిపేటలో మరో అద్భుతఘట్టం
బుస్సాపూర్‌లోని సిద్దిపేట మున్సిపాలిటీ డంపుయార్డులో నిర్మించిన బయోగ్యాస్‌ ప్లాంటు

 ఇంటింటా సేకరించిన తడిచెత్తతో బయోగ్యాస్‌

 దేశంలోనే రెండోప్లాంటు నిర్మాణం ఇక్కడే

 నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి,సిద్దిపేట,డిసెంబరు19: స్వచ్ఛత, పచ్చదనం, పారిశుధ్యంలో సిద్దిపేట పట్టణం రోల్‌మోడల్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే జాతీయస్థాయిలో 21 అవార్డులను ఈ పట్టణం గెల్చుకున్నది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కృషి ప్రజల భాగస్వామ్యంతో ఆదర్శ పట్టణంగా నిలుస్తున్నది. చెత్త సేకరణలోనూ వైవిద్యాన్ని ప్రదర్శిస్తూ తడి, పొడి హానికర చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఈ సేకరించిన తడిచెత్త వృథా కాకుండా బయోగ్యా్‌సను తయారుచేసే కీలకమైన ఘట్టానికి రూపకల్పన చేశారు.  సిద్దిపేటలోని తడిచెత్తతో ఇప్పటికే సేంద్రీయ ఎరువులను పలు వార్డుల్లో తయారుచేస్తున్నారు. ఇది కేవలం 5 నుంచి 10శాతం చెత్తకే పరిమితమవుతున్నది. మిగితా చెత్తను డంపుయార్డుకే తరలిస్తున్నారు. ఇక ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లు కలగలిపిన హానికర చెత్త, పొడిచెత్తను విద్యుత్‌ తయారీ, ఇటుకల తయారీకి వినియోగిస్తున్నారు. అయితే తడిచెత్తనూ పూర్తిస్థాయిలో వినియోగించడమే లక్ష్యంగా యోచించారు. 


దేశంలోనే రెండోప్లాంట్‌ సిద్దిపేటలో..


మున్సిపాలిటీల్లో సేకరించే తడిచెత్తతో బయోగ్యాస్‌ తయారుచేసే మొదటి ప్లాంటు బెంగళూరు నగరంలో ఉంది. రెండవ ప్లాంటును సిద్దిపేట పట్టణశివారులోని బుస్సాపూర్‌ డంపుయార్డు వద్ద ఏర్పాటు చేయడం విశేషం. అనూహ్యస్థాయిలో ప్రత్యేకంగా తడిచెత్తను వేర్వేరుగా సేకరించడంతో ఈ ఆలోచన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిప్లాంటు ఇక్కడ ఏర్పాటు చేయనుండటం ప్రత్యేకతను సంతరించుకున్నది. దక్షిణ భారత దేశంలోనే తొలి స్వచ్ఛబడిని సైతం సిద్దిపేటలోనే ఏర్పాటు చేసి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. బయోగ్యాస్‌ ప్లాంటు నిర్వహణ బాధ్యతను కార్బన్‌ లేట్స్‌ ఇండియా అనే కంపెనీకి అప్పగించారు. పదేళ్లపాటు ఈ ప్లాంటును ఇదే సంస్థ నిర్వహిస్తుంది. 


రూ.6కోట్ల వ్యయంతో..


మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో స్వచ్ఛభారత్‌కు సంబంధించిన రూ.6కోట్ల నిధులను ఈ బయోగ్యాస్‌ నిర్మాణ ప్లాంటు కోసం వెచ్చించారు. పట్టణంలోని 40వేల కుటుంబాల నుంచి ప్రతీరోజు 25 నుంచి 30టన్నుల వరకు తడిచెత్తను సేకరిస్తున్నారు.  దీనిని క్రషింగ్‌ చేసి పైపుద్వారా ఫ్రీ డీజేస్టర్‌ అనే ట్యాంకులోకి పంపించి మూడు రోజులు నిల్వ ఉంచి ద్రావణంగా మారుస్తారు. అక్కడి నుంచి మరో ట్యాంకులోకి ఈ ద్రావణాన్ని సరఫరా చేసి మైక్రో ఆర్గాన్‌లను కలుపుతారు. ఈ సమయంలో విడుదలయ్యే మిథేన్‌ గ్యాస్‌ నుంచి సీఎన్‌జీ బయోగ్యా్‌సను వేరుచేసి సిలిండర్లలో నింపుతారు. వారం రోజుల అనంతరం ఎంత చెత్తకు.. ఎంత గ్యాస్‌ తయారవుతుందనే అంచనాకు రానున్నారు. ఈ బయోగ్యాస్‌ ప్లాంటును నేడు మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. 


 

Updated Date - 2021-12-20T05:28:10+05:30 IST