అన్నా..మీరు బాగుండాలి

ABN , First Publish Date - 2021-06-22T04:52:30+05:30 IST

స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కారు ఆదివారం రాత్రి ప్రమాదానికి గురికావడం సిద్దిపేట ప్రజల్లో ఆందోళనను రేకెత్తించింది. అప్పటిదాకా సీఎం పర్యటనలో అన్నీ తానై వ్యవహరించి.. హైదరాబాద్‌ బయల్దేరిన కాసేపటికే దుర్ఘటన జరగడంతో అభిమానులు, స్థానిక ప్రజలు షాక్‌కు గురయ్యారు.

అన్నా..మీరు బాగుండాలి
సిద్దిపేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో నూటొక్క కొబ్బరికాయలు కొట్టిన టీఆర్‌ఎస్‌ నేతలు

మంత్రి హరీశ్‌రావు కారు ప్రమాదంతో పూజలు, పరామర్శలు

హైదరాబాద్‌ బాటపట్టిన అభిమానులు

గవర్నర్‌, ఇతర నేతలు, స్థానికుల పరామర్శలు

క్షేమంగా బయటపడడంతో పూజలు, ప్రార్థనలు

అభిమాన నేత చల్లగా ఉండాలంటూ మొక్కులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్‌ 21 : స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కారు ఆదివారం రాత్రి ప్రమాదానికి గురికావడం సిద్దిపేట ప్రజల్లో ఆందోళనను రేకెత్తించింది. అప్పటిదాకా సీఎం పర్యటనలో అన్నీ తానై వ్యవహరించి.. హైదరాబాద్‌ బయల్దేరిన కాసేపటికే దుర్ఘటన జరగడంతో అభిమానులు, స్థానిక ప్రజలు షాక్‌కు గురయ్యారు. కార్ల ముందు భాగం నుజ్జునుజ్జు కావడం, కార్లలోని బెలూన్లు తెరచుకోవడంతో ప్రమాద తీవ్రతపై ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన జరిగినా గట్టి ధైర్యంతోనే

ప్రమాదం వద్ద మంత్రి హరీశ్‌రావు వ్యవహరించిన తీరును పలువురు కొనియాడుతున్నారు. ఒక నాయకుడిగా చాలా పరిణితితో కనిపించారని అంటున్నారు. ఓవైపు పెను ప్రమాదం నుంచి బయటపడి మరోవైపు తన వ్యక్తిగత సహాయకులు, గన్‌మెన్ల పరిస్థితిని ఆరా తీసి గాయపడ్డ వారిని స్వయంగా ఇతర వాహనాల్లో ఎక్కించారు. వారిని ఆస్పత్రికి పంపించి మంచి చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. రాజీవ్‌ రహదారిపై నెలకొన్న ట్రాఫిక్‌ను తానే క్లియర్‌ చేశారు. వాహనాలకు అడ్డంగా వచ్చి చనిపోయిన అడవి పందులను పక్కకు తొలగింపజేశారు. సంఘటనను చూసి ఎవరూ హైరానా పడకుండా మనోధైర్యం కల్పించారు. అనంతరం మరో వాహనంలో తాను హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. 

హరీశ్‌కు పరామర్శల వెల్లువ

ఆదివారం రాత్రి సంఘటన జరిగినప్పటి నుంచి మంత్రి హరీశ్‌రావుకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు వ్యక్తిగతంగా ఫోన్లుచేసి, మెసేజ్‌లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సిద్దిపేట జిల్లాతోపాటు రాష్ట్ర నలుమూలల ఉన్న తన అభిమానులు, ప్రజాప్రతినిధులు మంత్రిని కలిసి పరామర్శించారు. సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లారని తెలిసి మరికొందరు అభిమానులు హైదరాబాద్‌కు వెళ్లకుండా నిలిచిపోయారు.

మొక్కులు.. పూజలు.. ప్రార్థనలు

ప్రమాదంలో తమ అభిమాన నేత క్షేమంగా బయటపడ్డందుకు పలువురు నాయకులు, అభిమానులు దైవప్రార్థనలు చేశారు. తిరుమలకు కాలినడకన వెళ్తామని ఆయన అభిమానులు చేపూరి శేఖర్‌గౌడ్‌, బెల్లంకొండ వెంకట్‌, కంకటి నవీన్‌గౌడ్‌, అనుదీప్‌ మొక్కుకున్నట్లు తెలిపారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మార్కెట్‌ చైర్మన్‌ పాలసాయిరాం, కౌన్సిలర్‌ కలకుంట్ల మల్లికార్జున్‌, గుండు శ్రీనివాస్‌, ఆకుబత్తిని రాము తదితరులు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు ఇర్షాద్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. పట్టణ వడ్డెర సంఘం అధ్యక్షుడు ఆలకుంట మహేందర్‌ ఆధ్వర్యంలో యాదాద్రిలో అభిషేకం చేయించారు. సిద్దిపేటకు చెందిన ఖాజా ముజాఫర్‌ అనే యువకుడు సౌదీలోని మసీదులో ఉమ్రా చేయించారు. 

పేదల ఆశీస్సులే శ్రీరామరక్ష  : ఎమ్మెల్సీ ఫారూఖ్‌

నిరంతరం పేదల సంక్షేమమే లక్ష్యంగా మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ అన్నారు. ఆయనకు కులమతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని చెప్పారు. ఆ అభిమానుల ఆశీస్సుల వల్లనే అంత పెద్ద ప్రమాదంలో కూడా చిన్న గాయం కాకుండా బయటపడ్డారని సంతోషించారు. పేదలకు చేసిన సహాయం వృథా కాదని ఈ సంఘటనతో మరోసారి  రుజువైందని వివరించారు. సోమవారం స్థానిక సూఫియా మసీదులో ప్రార్థనలు నిర్వహించారు.  కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. Updated Date - 2021-06-22T04:52:30+05:30 IST