ప్రారంభానికి నోచుకోని అంగన్‌వాడీ భవనం

ABN , First Publish Date - 2021-11-29T05:21:13+05:30 IST

అంగన్‌వాడీ భవనం శిథిలావస్థకు చేరడంతో లక్షలు వెచ్చించి కొత్త భవనాన్ని నిర్మించారు. కానీ సంవత్సరాలు గడుసున్నా... అంగన్‌వాడీ భవనం మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు.

ప్రారంభానికి నోచుకోని అంగన్‌వాడీ భవనం
సంగారెడ్డి మండలం అంగడిపేటలో నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాని అంగన్‌వాడీ భవనంరూ.15.70 లక్షలతో నిర్మాణం

శిథిలాల్లోనే చిన్నారుల చదువులు

భయబ్రాంతులకు గురవుతున్న తల్లిదండ్రులు

పట్టించుకోని సంబంఽధిత శాఖాధికారులు

సంగారెడ్డిరూరల్‌, నవంబరు 28: అంగన్‌వాడీ భవనం శిథిలావస్థకు చేరడంతో లక్షలు వెచ్చించి కొత్త భవనాన్ని నిర్మించారు. కానీ సంవత్సరాలు గడుసున్నా... అంగన్‌వాడీ భవనం మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. శిథిలావస్థలో ఉన్న భవనంలోనే చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో అనుకుంటే పొరబడినట్టే... జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న సంగారెడ్డి మండలం కల్పగూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని అంగడిపేట గ్రామంలోనే. ఈ గ్రామంలో అంగన్‌వాడీ భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిని అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించారు. అది కాస్త శిథిలావస్థకు చేరి పైపెచ్చులూడుతుండడంతో పాత భవనం వెనుక వైపు ఉన్న స్థలంలో రూ.15.70 లక్షల నిధులతో అంగన్‌వాడీ నూతన పక్కా భవనాన్ని నిర్మించారు. అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా... ప్రారంభించకుండా శిథిలమైన భవనంలోనే కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. పిల్లలు ఉన్న సమయంలో గది పై పెచ్చులూడడంతో బిక్కు బిక్కుమంటూ ఉంటున్నామని అంగన్‌వాడీ టీచర్‌ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని టీచర్‌, సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
Updated Date - 2021-11-29T05:21:13+05:30 IST