558 మీటర్ల ఎత్తుకు..

ABN , First Publish Date - 2021-06-22T04:49:49+05:30 IST

బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో 558 మీటర్ల ఎత్తున ఉన్న కంగ్టి మండలానికి సైతం సాగునీరు అందించనున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సోమవారం ఆయన ప్రారంభించారు.

558 మీటర్ల ఎత్తుకు..
బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ప్రారంభిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో అందనున్న సాగునీరు

ఖేడ్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో లక్షా 65 వేల ఎకరాలు సస్యశ్యామలం

నల్లవాగును మంజీర జలాలతో నింపుతాం

నూతన చెరువుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం

రైతుల కోసమే ప్రత్యేకంగా జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


మనూరు, జూన్‌ 21 : బసవేశ్వర ఎత్తిపోతల పథకంతో 558 మీటర్ల ఎత్తున ఉన్న కంగ్టి మండలానికి సైతం సాగునీరు అందించనున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో నారాయణఖేడ్‌ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేదని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రగతిపథంలో సాగుతున్నదని అన్నారు. నియోజకవర్గంలోని 175 చెరువులు ఏడాది పొడవునా నిండుకుండల్లా కళకళలాడటం కోసమే బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును చేపడుతున్నామని వివరించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో లక్షా 31 వేల ఎకరాలకు, అందోల్‌ నియోజకవర్గంలోని రేగోడు, వట్‌పల్లి మండలాల్లో 34 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సర్వే పనుల కోసం రూ.11.15 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. మూడునెలల్లో సర్వే పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నల్లవాగు ప్రాజెక్టును మంజీరా నీళ్లతో నింపుతామని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమంలో భాగంగా రూ.80 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేశామన్నారు. నూతనంగా చెరువుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో గతంలో ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అండగా ఉంటున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీచైర్‌పర్సన్‌ మంజూశ్రీజైపాల్‌రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, అదనపు కలెక్టర్‌ రాజార్షిషా, సీఈ సంగమేశ్వర్‌, ఎంపీపీ కొంగరి జయశ్రీ, నాగల్‌గిద్ద జడ్పీటీసీ రాజురాథోడ్‌, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 


సర్వే పనులు పూర్తయ్యాక నల్లపోచమ్మకు ముక్కుపుడక సమర్పిస్తా 

ప్రసిద్ధిగాంచిన బోరంచ నల్లపోచమ్మ ఆలయాన్ని మంత్రి హరీశ్‌రావు సోమవారం దర్శించుకున్నారు. ఈవో మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలను నిర్వహించారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు పూర్తయిన అనంతరం అమ్మవారిని మరోసారి దర్శనం చేసుకుంటానని మంత్రి తెలిపారు. అమ్మవారికి బంగారు ముక్కుపుడకను సమర్పిస్తానని మొక్కుకున్నారు.


జయశంకర్‌ స్ఫూర్తితోనే ప్రాజెక్టులు

జోగిపేట, జూన్‌ 21 : తెలంగాణ జాతిపిత జయశంకర్‌ సార్‌ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులను నిర్మించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుల నీళ్లతోనే ఈ యాసంగిలో 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల దాన్యం పండించి నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. సోమవారం ఆయన జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రొఫెసర్‌ జయశంకర్‌ నమ్మారన్నారు. అందుకే ఆయన కేసీఆర్‌ వెన్నంటి ఉన్నారని గుర్తుచేశారు. జయశంకర్‌ సార్‌ సూచనలతోనే కేసీఆర్‌ శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి ఆయన స్వప్నాన్ని సాకారం చేశారన్నారు. సార్‌ ఆశించనట్టు మన నిధులు మనకే దక్కాయన్నారు. దీంతో కరోనా కష్ట కాలంలోనూ పెట్టుబడి సాయం కింద రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ  చేశామని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమంలోనూ ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మాట్లాడుతూ జయశంకర్‌ స్ఫూర్తిని అణువణువునా నింపుకున్న కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయన ఆశయసాధనకు కృషి చేస్తునదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కే రమేశ్‌, ఎంపీపీ జోగు బాలయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతిస్వామి, ఏఎంసీ, మున్సిపల్‌ చైర్మన్లు మల్లికార్జున్‌గుప్తా, గూడెం మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-06-22T04:49:49+05:30 IST