రామవరం మందుపాతర ఘటనకు 30 ఏళ్లు

ABN , First Publish Date - 2021-12-19T05:42:57+05:30 IST

అక్కన్నపేట్‌ మండలం రామవరం గ్రామ శివారులో మావోయిస్టులు మందుపాతరతో అర్టీసీ బస్సును పేల్చి పోలీసులతో పాటు ఉద్యోగులను హతమార్చిన సంఘటనకు ఆదివారానికి సరిగ్గా 30 ఏళ్లు గడిచాయి.

రామవరం మందుపాతర ఘటనకు 30 ఏళ్లు
హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద విల్సన్‌ విగ్రహం

నేడు హుస్నాబాద్‌లో ఎస్‌ఐ జాన్‌విల్సన్‌, సీఐ యాదగిరిల వర్ధంతి

హుస్నాబాద్‌, డిసెంబరు 18: అక్కన్నపేట్‌ మండలం రామవరం గ్రామ శివారులో మావోయిస్టులు మందుపాతరతో అర్టీసీ బస్సును పేల్చి పోలీసులతో  పాటు ఉద్యోగులను హతమార్చిన సంఘటనకు ఆదివారానికి సరిగ్గా 30 ఏళ్లు గడిచాయి. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. 1991 డిసెంబర్‌ 19వ తేదీన రామవరం గ్రామంలో బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఒక ఆర్టీసీ బస్సును దహనం చేశారు.  అనంతరం పోలీసుల కోసం రామవరం గుట్టవద్ద రోడ్డుపై మందుపాతర అమర్చి మాటు వేశారు. సాయంత్రం హుస్నాబాద్‌ ఇన్‌చార్జిగా ఉన్న హుజూరాబాద్‌ సీఐ యాదగిరి, ఎస్‌ఐ జాన్‌ విల్సన్‌లతో పాటు మరికొంత మంది ఇంకో ఆర్టీసీ బస్సులో రామవరానికి వెళ్లారు. దహనమైన బస్సును పంచనామా చేసుకొని తిరిగివస్తున్న క్రమంలో నక్సలైట్లు మందుపాతరను పేల్చడంతో బస్సు తునాతునకలైంది. ఈ ఘటనలో సీఐ యాదగిరి, ఎస్‌ఐ జాన్‌విల్సన్‌, సీఆర్‌పీఎఫ్‌ సీఐ అబ్రహం, ఎస్‌ఐ కాశ్మిర్‌లాల్‌, సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లతో పాటు ఆర్టీసీ సిబ్బంది, గ్రామ సుంకరులు, పీపుల్స్‌వార్‌ మిలిటెంట్లు మొత్తం 15 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.  కాగా ఈ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు పొందిన జాన్‌ విల్సన్‌ మందుపాతరలో మృతి చెందడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. ఇప్పటికీ ఆయన ఫొటోలు హుస్నాబాద్‌ పట్టణంలోని దుకాణాల్లో దర్శనమిస్తుంటాయి. యువకులు క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారు.  జాన్‌విల్సన్‌ ట్రస్టు కూడా ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  ఆదివారం జాన్‌విల్సన్‌  విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2021-12-19T05:42:57+05:30 IST