వందశాతం లక్ష్యం నెరవేరేనా?
ABN , First Publish Date - 2021-10-21T04:50:25+05:30 IST
ఏడాదిన్నర పాటు కరోనా కేసుల్లో రెడ్ జోన్‌గా గుర్తించబడిన సిద్దిపేట జిల్లా పూర్తిగా తేరుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ చకచకా కొనసాగడం, వైరస్ ప్రభావంతో హడలెత్తిపోయి తగిన జాగ్రత్తలు పాటించడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మూడో వేవ్ భయం పట్టుకున్నప్పటికీ ఇప్పటివరకైతే అలాంటి సంకేతాలు కానరాకపోవడం ఉపశమనాన్ని కలిగిస్తున్నది. అయితే నూటికి 85 శాతమే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగతా వారు ఇంకా వ్యాక్సిన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వందశాతం లక్ష్యం సాధ్యమవుతుందో లేదో సందేహం నెలకొన్నది.

కొందరు వ్యాక్సినేషన్‌కు ముందుకురాని వైనం
సిద్దిపేట జిల్లాలో మొదటి డోసు 85 శాతమే
వెనుకడుగు వేస్తున్న 18-44 ఏళ్ల వారు
33 శాతానికి పరిమితమైన రెండో డోసు
నియంత్రణలోనే కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 20 : ఏడాదిన్నర పాటు కరోనా కేసుల్లో రెడ్ జోన్‌గా గుర్తించబడిన సిద్దిపేట జిల్లా పూర్తిగా తేరుకుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ చకచకా కొనసాగడం, వైరస్ ప్రభావంతో హడలెత్తిపోయి తగిన జాగ్రత్తలు పాటించడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఫలితంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మూడో వేవ్ భయం పట్టుకున్నప్పటికీ ఇప్పటివరకైతే అలాంటి సంకేతాలు కానరాకపోవడం ఉపశమనాన్ని కలిగిస్తున్నది. అయితే నూటికి 85 శాతమే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగతా వారు ఇంకా వ్యాక్సిన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వందశాతం లక్ష్యం సాధ్యమవుతుందో లేదో సందేహం నెలకొన్నది.
జిల్లాలో 9 లక్షల కొవిడ్ పరీక్షలు
సిద్దిపేట జిల్లాలో 2020వ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలోని ప్రధాన ఆస్పత్రులు, పీహెచ్‌సీల వద్ద టెస్టులు చేస్తూనే ఉన్నారు. మొత్తంగా సుమారు 9 లక్షల వరకు పరీక్షలు చేయగా.. 48 వేల మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 230 మంది వరకు చనిపోయినట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. తాజా పరిస్థితిని పరిశీలిస్తే బుధవారం రోజున జిల్లాలో 1530 మందికి కరోనా పరీక్షలు చేయగా కేవలం ఏడుగురికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. బాధితులు సైతం ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు.
యువత వెనుకంజ
జిల్లాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పైబడిన వారంతా కలిపి 6,23,809 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 5,29,317 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మొత్తంగా 85 శాతం మంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు 95 శాతం వ్యాక్సిన్ తీసుకోగా.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పైబడిన వారు కూడా 90 శాతానికి పైగానే వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపించారు. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉన్న వారు మాత్రం 78 శాతం లోపే ఉండడం గమనార్హం. ఇక రెండవ డోసు కూడా జిల్లా మొత్తంగా 35 శాతానికిపైగా తీసుకున్నారు. కొవిడ్ భయానక పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి స్వచ్ఛందంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి శాతం 90 వరకు ఉండగా.. ఇంకా 10 శాతం మంది వ్యాక్సిన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే నూటికి నూరు శాతం వ్యాక్సిన్ సాధ్యసాధ్యాలపై అనుమానం వ్యక్తమవుతున్నది.
కేటగిరి టార్గెట్ మొదటిడోసు రెండో డోసు
హెల్త్ కేర్ వర్కర్లు 8,046 7,554 6,325
ఫ్రంట్ లైన్ వర్కర్లు 9,560 9,025 6,590
18-44 వయసు 3,26,046 2,54,372 43,277
45-59 వయస్సు 1,67,400 1,52,584 84,931
60ఏళ్ల పైవారు 1,12,757 1,05,782 62,122
మొత్తం 6,23,809 5,29,317 2,03,245
షరా మామూలే..
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ప్రజల్లోనూ పూర్తిగా భయం పోయింది. మాస్కులు మొక్కుబడిగానే ధరిస్తున్నారు. భౌతిక దూరం, శానిటైజేషన్‌ను పూర్తిగా విస్మరించారు. ఇటీవల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా జనసంచారం ఉండడంతో అక్కడక్కడ మళ్లీ పాజిటివ్ కేసులు పుట్టుకొచ్చినప్పటికీ.. సింగిల్ డిజిట్ అంకెలోనే ఉండడం ఊరటనిస్తున్నది. అయితే వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉండడంతో కరోనా టెస్టులు పెరిగాయు. గడిచిన నెల రోజులుగా వెయ్యికిపైగానే పరీక్షలు జరుగుతున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉంటోంది.