తప్పెవరిది?

ABN , First Publish Date - 2021-07-20T04:44:13+05:30 IST

అవగాహనా రాహిత్యంతో గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ రెండు గేట్ల నుంచి నీటిని విడుదల చేయడంతో నీరు అసంపూర్తిగా ఉన్న ఎడమ కాల్వ ఎక్కి పారింది. కాల్వ కోతకు గురై, 300 ఎకరాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.

తప్పెవరిది?
పంట పొలాల్లో పేరుకున్న ఇసుక మేటలు

తెరిచిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ రెండు గేట్లు

అసంపూర్తి నిర్మాణంతో కాల్వకు గండి

వందల ఎకరాల్లో దెబ్బతిన్న పంట పొలాలు


 గద్వాల, జూలై 19: అవగాహనా రాహిత్యంతో గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ రెండు గేట్ల నుంచి నీటిని విడుదల చేయడంతో నీరు అసంపూర్తిగా ఉన్న ఎడమ కాల్వ ఎక్కి పారింది. కాల్వ కోతకు గురై, 300 ఎకరాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. నీటిని ఎవరు విడుదల చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

పూర్తి కాని కాల్వ నిర్మాణం: 75 కిలో మీటర్లు నిర్మించాల్సిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ ఎడమ కాలువ పూర్తి స్థాయిలో చేపట్ట లేదు. రిజర్వాయర్‌ నుంచి కాలువలోకి నీటి(500 క్యూసెక్కులు)ని విడుదల చేసేలా గేట్ల నిర్మాణం జరిగినా, అవి ఇంకా ప్రాజెక్టు అధికారులకు కాంట్రాక్ట్‌ పొం దిన సంస్థ స్వాధీనం చేయలేదు. 2019లో మోటార్లు అమర్చడంతో సంస్థ ప్రతినిధులు పని చేసుకునే సమయంలో తెరవడం, మూయడం చేస్తు న్నారు. కాల్వ పరిధిలో ఏటా 10వ కిలో మీటర్‌ వరకు నీటి పారుదల ఉండేలా గేట్లను అనధికారికంగా తెరుస్తున్నారు. వారం కిందట కూడా ఇదే ప్రతిపాదికన గేట్లను తెరిచారు. చెరువులు నిండటంతో పాటు, రైతులు కూడా కాలువకు మోటార్లు వేసి నీటిని తీసుకుంటారని భావించారు. అవగాహన లేకుండా గేట్లను తెరవడం వల్ల ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన గుడ్డెందొడ్డి(1.19 టీఎంసీ), ర్యాలంపాడు (4టీఎంసీలు) రిజర్వాయర్‌లకు నాలుగు రోజుల కిందట నీటి విడుదల ప్రారంభించారు. దాంతో గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌లోకి నీటి ప్రవాహం పెరిగింది. ఆ ఉధృతి వల్ల వచ్చిన ఒత్తిడి తెరిచిన గేట్లపై పడింది. అసంపూర్తి కాలువ నిర్మాణం వల్ల నీరు ముందుకు వెళ్లలేక కాలువ ఎక్కి పారింది. రిజర్వాయర్‌ పంపు హౌస్‌ సమీపంలో కాలువ కోతకు గురైంది. మూడు రోజుల పాటు ఈ ప్రవాహం ఉండటంతో సుమారు 300 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిలో మిరప, ఉల్లి, వరి నారు పోశారు. ముంపునకు గురైన పొలాలు మరో నాలుగేళ్ల వరకు సాగుకు పనికి రావని రైతుల కన్నీరు పెడుతున్నారు. గేట్లు మూసి వేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి దగ్గరుండి గేట్ల నుంచి ప్రవాహ వేగం తగ్గించడానికి రిజర్వాయర్‌ తూములను తాత్కలికంగా రాళ్లు, మట్టితో మూసివేయించారు. అయిప్పటికీ నీటి ప్రవాహం తగ్గకపోవడంతో ప్రధాన కాలువకు గండి కొట్టి, తూముల నుంచి వస్తున్న ప్రవాహాన్ని నెట్టెంపాడు అప్రోచ్‌ కెనాల్‌లోకి మళ్లించారు. గేట్లు ఎవరు తెరిచారు?, జరిగిన నష్టానికి ఎవరిని బాధ్యులను చేస్తారు? అన్న విషయంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇంత జరిగినా ఒక్క అధికారి కూడా తమ వద్దకు రాలేదని బాధిత రైతులు ఆంజనేయులు, నర్సిములు, గోవిందు వాపోయారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని ఈఈ రహీమొద్దీన్‌ చెప్పారు. రైతులకు మేలు చేసే ఉద్దేశంతో సమీప గ్రామ ప్రజాప్రతినిధులు అత్యుత్సాహంతో ఏటా గేట్లను ఇష్టారీతిగా తెరవడం, మూయడం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది.

Updated Date - 2021-07-20T04:44:13+05:30 IST