ఇసుక ధరకు రెక్కలు

ABN , First Publish Date - 2021-05-06T04:52:13+05:30 IST

తుంగభద్ర నదిలో టీఎస్‌ఎండీసీ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచి పోయాయి.

ఇసుక ధరకు రెక్కలు
అలంపూర్‌ సమీపంలో ఇసుకలో పేరుకపోయిన మట్టి

అలంపూర్‌, తుమ్మిళ్ల రీచ్‌లలో నిలిచిన తవ్వకాలు

నదీ పరివాహక గ్రామాల్లో అక్రమంగా తవ్వుతున్న మాఫియా

అధిక ధరలకు అమ్ముతున్న వైనం


గద్వాల, మే 5 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిలో టీఎస్‌ఎండీసీ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచి పోయాయి. దాంతో ఇసుకకు డిమాండ్‌ ఏర్పడటంతో ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు నదిలోంచి ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు. రాత్రికి రాత్రి రెట్టింపు ధరలకు అమ్మి, సొమ్ము చేసుకుం టున్నారు. ఈ క్రమంలో వినియోగదారులపై భారం పెరుగగా, ప్రభుత్వ ఆదాయానికీ గండి పడింది.

రెండు రీచ్‌లలో ఇసుక నిల్‌: టీఎస్‌ఎండీసీ(తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌) తుంగభద్ర నదిలో అలంపూర్‌, తుమ్మిళ్ల ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చింది. అలంపూర్‌ రీచ్‌లో ఇసుకలో మట్టి రావడంతో తవ్వకాలు నిలిపేశారు. తుమ్మిళ్ల రీచ్‌లో నదిలో నీళ్లు ఉండడంతో తవ్వకాలు చేయలేకపోతున్నారు. దీంతో తుంగభద్ర ఇసుక బంగారమైంది. అక్రమార్కులు నదీ పరివాహక గ్రామాల్లో ఇసుకను తవ్వి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. 12 క్యూబిక్‌ మీటర్ల లారీ ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే 12,800కు ఇంటికి వస్తుంది. కానీ ఇదే లారీ ఇసుకను ప్రస్తుతం మార్కెట్‌లో రూ.35 వేల నుంచి రూ.40 వేలు అమ్ముతున్నారు.

రాత్రి వేళ అక్రమంగా తవ్వకాలు: జిల్లాలోని రెండు ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిచిపోవడంతో ఇసుక మాఫియాకు రెక్కలు వచ్చాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో నది పరివాహక గ్రామాలైన ఇటిక్యాల మండలం వేణిసోంపురం, రాజోలి మండలంలో పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, మానవపాడు మండలం కొరివిపాడు, ఉండవల్లి మండలం పుల్లూరు, రాజోలీ, అలంపూర్‌ మండలంలోని మరికొన్ని గ్రామాల్లో రాత్రి వేళ ఇసుకను తవ్వి  రహస్య ప్రదేశంలో డంపు చేస్తున్నారు. మరుసటి రోజు ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ.8 వేలు, టిప్పుర్‌కు రూ.35 వేల నుంచి రూ.45లకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా గనులు భూగర్భశాఖ అధికారులు కానీ, రెవెన్యూ, పోలీస్‌ విభాగాలు గానీ కరోనా ముసుగులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి: తుమ్మిళ్ల రీచ్‌లో 1.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తీయడానికి అనుమతి ఇచ్చారు. గత సంవత్సరం ఇక్కడ 45 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను మాత్రమే తీయగలిగారు. అలంపూర్‌ రీచ్‌లో 3.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వగా, గత ఏడాది 1.17 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తవ్వారు. తుమ్మిళ్లలో 74 వేల క్యూబిక్‌ మీటర్లు, అలంపూర్‌లో 2 లక్షల క్యూబిక్‌ మీటర్లు ఇసుకను తీయాల్సి ఉంది. ప్రభుత్వానికి గత ఏడాది తుమ్మిళ్ల రీచ్‌ నుంచి రూ. 3 కోట్లు, అలంపూర్‌ రీచ్‌ నుంచి రూ.7.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రెండు రీచ్‌లలో ఇసుక తీయడానికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.

ఇసుక లభ్యత లేకపోవడం నిజమే

తుంగభద్ర నదిలో ఏర్పాటు చేసిన రెండు ఇసుక రీచ్‌లలో పలు సమస్యలతో ఇసుక లభ్యత లేకుండా పోయింది. అలంపూర్‌లో ఇసుకలో మట్టి వస్తుందని కాంట్రాక్టర్‌ ఇసుక తీయడం లేదు. తుమ్మిళ్లలో ఇసుక తీయడానికి నదిలో నీరు అడ్డంకిగా మారింది. కొత్త రీచ్‌ల అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం.

- మహేందర్‌ శ్రీనివాసులు, ఏడీ టీఎస్‌ఎండీసీUpdated Date - 2021-05-06T04:52:13+05:30 IST