పోడు భూములకు పట్టాలెప్పుడు..?

ABN , First Publish Date - 2021-12-27T04:28:23+05:30 IST

ఏళ్లుగా సాగు చేస్తున్న భూమికి సంబంధించి ఇప్పటి వరకు వారికి భూ యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేవు.

పోడు భూములకు పట్టాలెప్పుడు..?
పానగల్‌ మండలం దవాజిపల్లిలో పోడు భూముల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

 - దరఖాస్తులు స్వీకరించి నెలరోజులు దాటినా ఉలుకుపలుకు లేదు..

- ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న జిల్లాస్థాయి అధికారులు

- వెంటనే దరఖాస్తులు పరిశీలించి.. పట్టాలివ్వాలంటున్న దరఖాస్తుదారులు

- ఉమ్మడి జిల్లాలో పోడు భూముల కోసం దరఖాస్తుల సంఖ్య 17457

- 45106 ఎకరాల భూమికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న రైతులు

(ఆంధ్రజ్యోతి, వనపర్తి): ఏళ్లుగా సాగు చేస్తున్న భూమికి సంబంధించి ఇప్పటి వరకు వారికి భూ యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేవు. పేరుకు సాగు చేసుకుంటున్నా తమ పేరిట భూ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతున్నారు. వాస్తవానికి అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2006 సంవత్సరంలో అటవీహక్కు చట్టం తీసుకువచ్చింది. ఇందులో 2005 డిసెంబరు 13వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. కానీ రాష్ట్రంలో మాత్రం ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ప్రభుత్వాలు మారడం, గిరిజనుల కంటే గిరిజనేతరులు ఎక్కువగా లబ్ధి పొందుతారనే భావన ప్రభుత్వ వర్గాల్లో ఉండటం వల్ల ఈ చట్టం రాష్ట్రంలో ఆచరణలోకి రాలేదు.  ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సంకల్పించింది. ఇందులో భాగంగా గ్రామం, మండలం, జిల్లా కమిటీలను నియమించింది. జిల్లాలో అటవీ భూమి ఎంత ఉంది,  రైతుల స్వాధీనంలో ఎంత ఉంది, ఎంత మంది రైతులు ఉన్నారు..  అనే వివరాలను సేకరించింది. నవంబరు 8 నుంచి డిసెంబరు 8వరకు  దరఖాస్తులు స్వీకరించాలని మొదట నిర్ణయించినా.. తర్వాత దాన్ని నవంబరు 16 వరకే కుదించారు. ఆ  వెంటనే పంపిణీ చేయాలనే తలంపుతో అధికారులు సర్వం సిద్ధం చేశారు.  దరఖాస్తుల స్వీకరణ పూర్తయినా.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యటన ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగులుతుండగా.. తమ పరిధిలో ఏం లేకపోవడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 17457 దరఖాస్తులు 

విస్తీర్ణ పరంగా పెద్దదైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్‌లో మాత్రమే పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉన్న దృష్ట్యా ఇక్కడ సమస్య స్వల్పంగా ఉంది. ప్రధానంగా నాగర్‌కర్నూలు జిల్లాలో నల్లమల అటవీప్రాంతం విస్తరించి ఉండటం, ఇక్కడ గిరిజనుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో పోడు భూములు సాగుచేసే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇక్కడ దాదాపు 35194.07 ఎకరాల కోసం సుమారు 10131 మంది పోడు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3974 మంది రైతులు, 7157 ఎకరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో 3021 మంది రైతులు 2363 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకోగా.. నారాయణపేట జిల్లాలో 322 మంది, 358.75 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక అత్యల్పంగా గద్వాల జిల్లాలో కేవలం 9 మంది మాత్రమే 33.25 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 45106 ఎకరాల కోసం 17457 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే వీరికి భూ యాజమాన్య హక్కు పత్రాలు అందజేయాల్సి ఉంది. కానీ  అధికారులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఉలుకుపలుకు లేకుండా ఉన్నారు. 

ఎప్పుడో చేయాల్సింది... 

ఏళ్లుగా అటవీ భూముల్లో నివాసముంటూ..  ఆ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం అటవీహక్కు చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 75 సంవత్సరాల క్రితం నుంచి ఆ భూములు సాగు చేసుకుంటున్న వారినే గుర్తించి ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. 2006లోనే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం అమల్లోకి వచ్చినా రాష్ట్రంలో మాత్రం అమలు కాలేదు. ఇక్కడ అటవీ భూములను ఆక్రమించిన వారిలో గిరిజనుల కంటే గిరిజనేతరుల సంఖ్య అధికంగా ఉండటం.. వివిధ ప్రాంతాల నుంచి అటవీ భూములు ఉన్న ప్రాంతాలకు వెళ్లి.. అక్కడ సాగు చేపట్టడం వల్ల అసలు పోడు రైతులను గుర్తించడం  సమస్యగా మారింది.  గత పాలకుటు వాయిదా వేసుకుంటూ వచ్చారు. గిరిజనుల్లో ఈ డిమాండ్‌ చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల సీఎం కేసీఆర్‌ పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో భూములు వస్తాయని ఆశిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో ఈసారి కూడా గిరిజనేతరుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎటూ తేల్చలేక.. మళ్లీ ఈ అంశంపై అటకెక్కే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ నిజంగా అటవీభూముల్లో తాతలకాలం నుంచి ఉంటున్న వారికి ఇప్పటికీ న్యాయం జరగకపోవడం దారుణమనే అంశం స్పష్టమవుతోంది.




Updated Date - 2021-12-27T04:28:23+05:30 IST