కోరిన కోర్కెలు తీర్చే పడమటి అంజన్న

ABN , First Publish Date - 2021-12-16T04:29:57+05:30 IST

కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారం పడమటి ఆంజనేయస్వామి జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆలయ ధర్మకర్త భీమాచార్య, ఈవో సత్యనారాయణ బుధవారం తెలిపారు.

కోరిన కోర్కెలు తీర్చే పడమటి అంజన్న
పడమటి ఆంజనేయస్వామి దేవాలయం

మక్తల్‌, డిసెంబరు 15 : కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారం పడమటి ఆంజనేయస్వామి జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆలయ ధర్మకర్త భీమాచార్య, ఈవో సత్యనారాయణ  బుధవారం తెలిపారు. 16న గురువారం ఉదయం 7 గంటలకు పురవీధుల గుండా ఉత్తరాది మఠం నుంచి స్వామివారి ఊరేగింపు, 8 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, అలంకారోత్సవం 8.30 గంటలకు హనుమాన్‌ వ్రతం, సాయంత్రం 6 గంటలకు స్వామివారికి గజవాహన సేవ, 17న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వాహన సేవ, 18న శనివారం ఉదయం 10 గంటలకు పవమాన హోమం, సాయంత్రం 6 గంటలకు నెమలి వాహన సేవ, సాయంత్రం 6.30 గంటలకు ప్రభోత్సవం, 19న ఆదివారం సాయంత్రం 3 గంటలకు పల్లకీ సేవ, 4 గంటలకు మంగళహారతి, 6 గంటలకు రథోత్సవం, 20న సోమవారం సాయంత్రం హంసవా హన సేవ, 6 గంటలకు పాల ఉట్లు కార్యక్రమం ఉంటుందన్నారు. 21న మంగళవారం స్వామివారికి చక్ర తీర్థ స్నానం, అశ్వవాహన సేవ, 22న బుధవారం సాయంత్రం 6 గంటలకు పూలరథం, కల్వవృక్ష వాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ జాతర ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. కావున భక్తులు విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు, ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. 

పడమర వైపు ఒంగి ఉన్న విగ్రహం 

ఆంజనేయస్వామి ఆలయానికి సుమారు 500 ఏళ్లకు పైగా విశిష్టమైన చరిత్ర ఉంది. కలియుగంలో వెలిసిన జాంబవంతుడి చేతుల మీదుగా ఆంజనేయస్వామి విగ్రహం పడమర ముఖంగా ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామి వారికి పడమటి ఆంజ నేయస్వామి అనే పేరు వచ్చింది. దేశంలో పడమటి దిక్కువైపు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం మక్తల్‌లో తప్ప మరెక్కడా లేదని ప్రతీతి. స్వామిని దర్శించు కుంటే సకలపాపాలు తొలగి మంచి జరుగుతోందని భక్తుల ప్రఘాడ విశ్వాసం. 

 గోపురం వద్దన్న ఆంజనేయస్వామి.. 

స్వామి గర్భాలయంలో గోపురం లేకపోవడం ఇక్కడ మరో విశిష్టత. పూర్వంలో రెండుసార్లు గోపురం నిర్మిం చేందుకు ప్రయత్నించగా పగుళ్లు వచ్చి కూలిపోయింది. అప్పటి అర్చకుడికి రాత్రి కలలో స్వామివారు ప్రసన్నమై సూర్యోదయం నుంచి సూర్యస్తమయం లోపు నదీజలా లను తీసుకొచ్చి ఆగమశాస్త్ర ప్రకారం గోపురం నిర్మిస్తేనే నిలుస్తుందని చెప్పారట. దీంతో ఒక్కరోజులో గోపురం నిర్మించడం సాధ్యపడకపోవడంతో గోపురం లేకుండానే స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 

ఏర్పాట్లు పూర్తి : సత్యనారాయణ, ఆలయ ఈవో

ఉత్సవాల్లో భక్తులకు తాగునీరు, విద్యుత్‌ సరఫరా వంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని నియమిస్తున్నాం. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం. అదే విధంగా భక్తులు విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించించాలి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలి. 

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి : ఎమ్మెల్యే చిట్టెం

జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జాతర మైదానం, ఆలయ ప్రాంగణాన్ని కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలఉట్ల మైదానం వద్ద గుంతలు పూడ్చివేయాలని, మురుగు నీరు జాతర మైదానం పరిసరాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని పుర సిబ్బందికి సూచించారు.  భక్తుల సౌకర్యార్థం బస్సులు నడపాలని పేట డిపో మేనేజర్‌కు సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ, పుర కమిషనర్‌ రాజయ్య, మహిపాల్‌రెడ్డి, రామలింగం, అమరేందర్‌, నేతాజీరెడ్డి పాల్గొన్నారు. Updated Date - 2021-12-16T04:29:57+05:30 IST