భూసేకరణకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-07-09T04:52:50+05:30 IST

భారత్‌మాల పథకంలో భాగంగా మహరాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వరకు జాతీయరహదారి నిర్మాణానికి చేపట్టిన భూసేకరణకు సహకరించాలని అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ రైతులను కోరారు.

భూసేకరణకు సహకరించాలి
మొక్క నాటుతున్న అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ

- అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ 

- నష్టపరిహారం సరిపోదన్న రైతులు

కేటిదొడ్డి, జూలై 8 : భారత్‌మాల పథకంలో భాగంగా మహరాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వరకు జాతీయరహదారి నిర్మాణానికి చేపట్టిన భూసేకరణకు సహకరించాలని అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ రైతులను కోరారు. మండలంలోని కుచినెర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎకరానికి రూ.4.14 లక్షలు పరిహరం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన పరిహరానికి తమ భూములిచ్చి నష్టపోలేమని, ఇక్కడి భూము లకు మార్కెట్‌ ధర ఎకరానికి రూ.20 లక్షలు ఉందని రైతులు అభ్యంతరం తెలిపారు. అంత తక్కువకు తమ పొలాలను ఇవ్వలేమని అన్నారు. ఈ విషయంపై తాము కలెక్టర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం హరితహరం కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్‌ మొక్కలను నాటారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.


అలసత్వం వహించొద్దు : శ్రీహర్ష

ధరూరు : అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష హెచ్చరించారు. మండలంలోని నెట్టెంపాడు, ద్యాగదొడ్డి, వామనపల్లి, రేవులపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను గురువారం ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నెట్టెంపాడు గ్రామంలో శ్మశానవాటిక, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులున్నా పనుల్లో జాప్యానికి కారణమేంటని నిలదీశారు. గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యపై ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. పెండింగ్‌ పనులన్నీ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 


Updated Date - 2021-07-09T04:52:50+05:30 IST