తేరు మైదానం బురదమయం
ABN , First Publish Date - 2021-11-22T04:50:20+05:30 IST
వందలాది మంది మేటి క్రీడాకారులను అందించిన పట్టణంలోని తేరు మైదానం చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారు తుంది.

- చిన్నపాటి వర్షానికే చిత్తడి
- క్రీడాకారుల అవస్థ
- మినీ స్టేడియం అభివృద్ధికి
తప్పని ఎదురు చూపులు
గద్వాల అర్బన్, నవంబరు 21 : వందలాది మంది మేటి క్రీడాకారులను అందించిన పట్టణంలోని తేరు మైదానం చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారు తుంది. గద్వాల సంస్థానాదీశుల కాలం నుంచి తేరు మైదానం వర్షపు నీటితో నిండి క్రీడాకారులకు ఇబ్బంది గా మారింది. సంస్థానాదీశుడు సోమనాద్రి పేరున దీనిని మినీ స్టేడియంగా మార్చేందుకు చేపట్టిన పనులు ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. కేవలం ఒకవైపు స్టేడియం పనులను పూర్తి చేసిన పాలకులు, మిగతా పనులను పూర్తి చేయ డంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, బీసీ కాలనీ, వంటెలపేట, కుంటవీధి, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరంతా మైదానాన్ని ఆనుకుని ఉన్న డ్రైనేజీ గుండా దిగువకు వెళ్లాల్సి ఉంది. ప్రధాన డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి వర్షపు నీరు సాఫీగా వెళ్లే అవకాశం లేకపోవడంతో మురుగునీరు వచ్చి మైదానంలోనే నిలిచిపోతుండటం తీవ్ర అసౌకర్యంగా మారింది.
దీనికి తోడు ప్రతీ సోమవారం నిర్వహించే వారాంతపు సంతలో దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు గుంతలు తవ్వడం, రాళ్లను విచ్చలవిడిగా అక్కడే వదిలి వేస్తుండటం కూడా సమస్యగా మారింది. ఇటీ వల కరోనా లాక్‌డౌన్ సందర్భంగా తేరు మైదానంలో కూరగాయల వ్యాపారాలు నిర్వహించుకున్నారు. అదే విధంగా స్వచ్ఛత పనుల్లో భాగంగా మునిసిపాలిటీ ఆ వరణలో చెట్లు నాటే కార్యక్రమం, రోడ్డు పనులు చేప ట్టే సమయాల్లో మునిసిపాలిటీకి చెందిన ట్రాక్టర్లు, చెత్త తొలగించే మినీ వాహనాలు, వాటర్ ట్యాంకర్లు, ఇతర వాహనాలను అన్నింటికి తేరు మైదానంలోనే పార్కింగ్ చేయడం వల్ల మైదానమంతా గుంతలు, రాళ్లతో నిండి పోతోంది. తమ అవసరం తీరాక మైదానాన్ని ఆటలకు అనువుగా సిద్ధంచేయాలన్న ధ్యాస అధికారు లకు లేకపోవడం వల్ల క్రీడాకారులకు సమస్యగా మా రింది. పట్టణంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా తేరు మైదానాన్ని వాడుకోవడమే తప్పా, దాన్ని అభివృద్ధి చే యాలన్న ధ్యాస ప్రజాప్రతినిధులకు, అధికారులకు లేకుండా పోయిందని క్రీడాకారులు వాపోతున్నారు. మైదానంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాస్త ఎత్తుగా ఉండేలా మొరం వేసి, నీరు బయటికి వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని తాము ఎన్నిసార్లు విజ్ఞప్తు లు చేసినా మునిసిపల్ అధికారుల నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక కౌన్సిలర్, మాజీ చైర్‌పర్సన్ బండల పద్మావతి వినతి మేరకు ఇటీవల మైదానాన్ని సందర్శించిన మునిసిపల్ చైర్మన్ బీ.ఎస్. కేశవ్ తేరు మైదానంకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని క్రీడాకారులు, క్రీడాఽభి మానులు కోరుతున్నారు.
ధనకు ఇబ్బందిగా మారింది
ఫుట్‌బాల్ సాధన చేసేందుకు అనువుగా ఉన్న తేరు మైదానంలో వర్షపు ఆగి ఉండటం వల్ల ఆటంకంగా మారింది. పాఠశాలలు, కళాశాలలు, రెగ్యులర్ తరగతులు లేని ఈ సమయంలో క్రీడలు ప్రాక్టీసు చేయాలంటే కూడా ఆటంకం ఏర్పడటం సమస్యగా మారింది. మైదానంలో వర్షపు నీరు ఆగకుండా చూడాలి.
- కిశోర్, క్రీడాకారుడు, గద్వాల
వర్షపు నీరు రాకుండా చూడాలి
పైభాగంలో నుంచి వచ్చే వర్షపు నీరు తేరు మైదానంలోకి రాకుండా తగిన ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం క్రీడలకు ఆటంకం లేకుండా మైదానం లో మొరం వేసి చదును చేయాలి. మైదానంలో నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేయాలి. అలాగే ఆయా కార్యక్రమాలు చేపట్టినప్పుడు మునిసిపల్ కార్మికులతో మైదానాన్ని శుభ్రం చేయించాలి.
- శివ, క్రీడాకారుడు
త్వరలోనే అభివృద్ధి పనులు
తేరు మైదానంలో నిలిచిపోయిన సోమనాద్రి మినీ స్టేడియం అభివృద్ధి పనులకు రూ.25లక్షల వరకు మునిసిపల్ కౌన్సిల్ నుంచి పరిపాలన మంజూరు లభించింది. త్వరలోనే పనులు చేప ట్టనున్నారు. మైదానం ఎత్తు పెంచడంతో పాటు స్టేడియం స్టేజీపై షెడ్డు ఏర్పాటు చేయడం, రెండు వైపులా గేట్లను అమర్చడం, రెండు ఫ్లడ్ లైట్లను బిగించేందుకు నిర్ణయించారు.
- బండల పద్మావతి, కౌన్సిలర్