బతుకుదెరువు ఇచ్చే రాష్ట్రం

ABN , First Publish Date - 2021-11-27T04:05:22+05:30 IST

‘‘సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు కేరాఫ్‌గా మార్చిన తెలంగాణను నేడు బతుకుదెరువు ఇచ్చే రాష్ట్రంగా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారు.

బతుకుదెరువు ఇచ్చే రాష్ట్రం
మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి; చిత్రంలో మరో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ, ఎమ్మెల్యే

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఎమ్మెల్సీలు కసిరెడ్డి, కూచుకుళ్లకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన కలెక్టర్‌

విజేతలను అభినందించిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు


మహబూబ్‌నగర్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు కేరాఫ్‌గా మార్చిన తెలంగాణను నేడు బతుకుదెరువు ఇచ్చే రాష్ట్రంగా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని పురోగాభివృద్ధిలోకి తీసుకెళ్లే మహాయజ్ఞంలో పని చేయడం ప్రజాప్రతినిధులుగా మా అందరికీ గర్వకారణం’’. అని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలుగా నూతనంగా ఎన్నికైన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు నుంచి ధ్రువీకరణ ప్రతాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి అభినందించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో పాలమూరును నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. హైదరాబాద్‌ తర్వాత ఆ స్థాయిలో ఉపాధి కల్పనకు పాలమూరును కేరాఫ్‌గా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఈదిశగా అభివృద్ధి సాధించడమే తమ ఏకైక లక్ష్యమని వివరించారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు నుంచి 14 లక్షల మంది వలస వెళితే, నేడు ఇక్కడికే కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ వస్తున్నారని అన్నారు. ఇక్కడ అమలయ్యే పథకాలకు ముగ్ధుడయిన బీజేపీకి చెందిన రాయచూరు ఎమ్మెల్యే తమ రాష్ట్రంలోనూ ఆ పథకాలు అమలు చేయాలని, లేకపోతే తమని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. మహబూబ్‌నగర్‌లో రూ.400 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, మన్యంకొండ ఎయిర్‌పోర్టుతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనుభవజ్ఞులైన కూచకళ్ల, కసిరెడ్డిని మళ్లీ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా గెలిపించేందుకు సహకరించిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తమ ఏకగ్రీవ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సైతం తమ ఎన్నికకు సహకరించారని, అందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి తమకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో పాలమూరు సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్‌.రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసింహులు, డీసీసీబీ డైరెక్టర్‌ జూపల్లి భాస్కర్‌రావు, బాల్సన్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T04:05:22+05:30 IST