ఆకాశంలో అద్భుతం

ABN , First Publish Date - 2021-01-13T03:36:19+05:30 IST

ఆకాశవీధిలో అద్భుతం జరుగనుంది. అందుకు పాలమూరు పట్టణంలోని స్టేడియం మైదానం వేదిక కానుంది.

ఆకాశంలో అద్భుతం
పారా మోటరింగ్‌ విన్యాసం

పాలమూరులో నేటి నుంచి అంతర్జాతీయ ఏరో స్పోర్ట్స్‌

పాల్గొననున్న 10 రాష్ట్రాల పారా మోటరింగ్‌ పైలట్లు

దేశంలోనే తొలిసారిగా నిర్వహణ

కనువిందు చేయనున్న సాహస విన్యాసాలు

ఐదు రోజుల పాటు పోటీలు

జిల్లా ప్రజలూ రైడ్‌ చేసే అవకాశం

పారా మోటరింగ్‌కు రూ.1,500

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌కు రూ.500

ప్రారంభించనున్న మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌


ఆకాశవీధిలో అద్భుతం జరుగనుంది. అందుకు పాలమూరు పట్టణంలోని స్టేడియం మైదానం వేదిక కానుంది. అంతర్జాతీయ ఎయిర్‌షో అండ్‌ పారామోటరింగ్‌ చాంపియన్‌షిప్‌ 2021 జిల్లా ప్రజలకు కనువిందు చేయనుంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గత ఏడాది సంక్రాంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను నిర్వహింపజేయగా, ఈ సారి ఏరో స్పోర్ట్స్‌ ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తమౌతోంది.

- మహబూబ్‌నగర్‌


సంక్రాంతి పండుగ సందర్భంగా పాలమూరు ప్రజలకు సంతోషం రెట్టింపు కానుంది. జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంతర్జాతీయ ఎయిర్‌ షో అండ్‌ పారా మోటరింగ్‌ చాంపియన్‌షిప్‌ను నిర్వహించ నున్నారు. ఈ పోటీలను ఉదయం 9 గంటలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించనున్నారు. అందుకోసం మంగళవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో పారామోటరింగ్‌ ప్రాక్టీస్‌ను అదనపు కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, సీతారామరావు ప్రాక్టీస్‌ను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈవెంట్లకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 


మొదటి సారిగా..

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దేశంలోనే మొదటి సారిగా పాలమూరులో ఈ ఏరో స్పోర్ట్స్‌ నిర్వహించనున్నారు. 10 రాష్ట్రాల పారామోటర్‌ పైలెట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. దేశంలోని 29 రాష్ట్రాలను ఆహ్వానించగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహా రాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఉత్తరాఖండ్‌, హర్యాన, గుజరాత్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల పారా మోటార్‌ పైలెట్లు పోటీల్లో పాలొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో మొదటి, రెండో స్థానం సాధించిన వారికి భవిష్యత్‌లో నిర్వహించే అంతర్జాతీయ పారామోటరింగ్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 


స్కై  డైవింగ్‌లు అంటే..

స్కై డైవింగ్‌ అంటే ఒక బెలూన్‌ నుంచి మరో బెలూన్‌లోకి ఆకాశంలోనే జంప్‌ చేయడం. మినీ ట్యాంక్‌ బండ్‌ పెద్ద చెరువుపైన ఈ విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. గతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను మంత్రి నిర్వహింపజేశారు. ఇప్పుడు అంతర్జాతీయ ఏరో స్పోర్ట్స్‌ నిర్వహించడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


యువతకు ప్రోత్సాహం

ఇలాంటి ఈవెంట్స్‌ కారణంగా యువతను ఏరో స్పోర్ట్స్‌, నేవీ వంటి విభాగాలవైపు ఆకర్శితులను చేసే అవకాశం ఉంది. ఈ విన్యాసాలను తిలకిస్తే పలువురు ఆయా రంగాలవైపు మొగ్గడానికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదివరకు యూరప్‌, అమెరికా దేశాలకే పరిమితమైన ఈ ఈవెంట్లు పాలమూరుకు తొలిసారిగా తెచ్చారు. 


ఆకాశంలో రైడ్‌ చేసే అవకాశం

ఈ పోటీలను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించగా, పైలట్లతో కలిసి ఆకాశంలో రైడ్‌ చేయాలంటే పారా మోటరింగ్‌కు రూ.1,500, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌కు రూ.500 తీసుకోనున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయి. 


అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

దేశంలోనే మొదటిసారిగా జరిగే ఈ పోటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్‌లో జిల్లాలోని కోయిల్‌సాగర్‌, మినీట్యాంక్‌బండ్‌ల వేదిక గా అంతర్జాతీయ ఏరో స్పోర్ట్స్‌ను నిర్వహించేందుకు కావలసిన వనరులు ఉన్నాయి. బ్రెజిల్‌లో త్వరలో జరిగే ఒలింపిక్‌ పోటీల్లో పాల్గొనేందుకు దేశం నుంచి నలుగురిని ఎంపిక చేసి, పర్యాటక శాఖ నుంచి ప్రోత్సాహం అందించి పంపించాలనే ప్రయ త్నం జరుగుతోంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎంతో సహకారం అందిస్తున్నారు. మాకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పోటీల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

- సుకుమార్‌, వర్టికల్‌ వరల్డ్‌ అడ్వెంచర్‌ ఏరో స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ 

Updated Date - 2021-01-13T03:36:19+05:30 IST