చదువుకున్న బడికి తన వంతు సాయం
ABN , First Publish Date - 2021-12-10T05:04:21+05:30 IST
చిన్నప్పుడు తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఆయన తన వంతు సాయం అందిస్తున్నారు.
- సొంత ఖర్చుతో పాఠశాల అభివృద్ధి
- ఏడవ వార్డు కౌన్సిలర్ దౌలన్న ఔదార్యం
గద్వాల టౌన్, డిసెంబరు 9 : చిన్నప్పుడు తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఆయన తన వంతు సాయం అందిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. గద్వాల మునిసిపాలిటీలోని ఏడవ వార్డులో ఉన్న విలీనగ్రామం దౌదర్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుత కౌన్సిలర్ టి.దౌలన్న ఏడవ తరగతి వరకు చదువుకున్నారు.
40 ఏళ్ల క్రితం ఏర్పాటు
దౌదర్‌పల్లిలో 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. పదేళ్ల క్రితం అప్పర్ ప్రైమరీ స్కూలుగా మార్చారు. విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగడంతో మండల పరిషత్ ఉన్నత పాఠశాలగా మారింది. ఇటీవలే జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలగా పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ క్రమంలో తాను బాల్యంలో విద్యనభ్యసించిన పాఠశాలను అభివృద్ధి చేయాలని కౌన్సిలర్ దౌలన్న భావించారు. సొంత డబ్బులతో పాఠశాలకు మరమ్మతులు చేయించి, రంగులు వేయించారు. ప్రహరీకి, తరగతి గదుల గోడలపై జాతీయనాయకులు, అందమైన చెట్లు, సరస్సులు, వన్యప్రాణుల చిత్రాలను వేయించారు. వంటశాల వద్ద మెనూ బోర్డును ఏర్పాటు చేయిం చారు. హరితహారంలో భాగంగా పాఠశాల ఆవర ణలో మొక్కల పెంపకం చేపట్టారు.
విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రెడ్డితో కలిసి దౌలన్న కృషి చేశారు. మధ్య తరగతి ప్రజలు ఎక్కు వగా నివసించే దౌదర్‌పల్లిలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను స్వయంగా కలిసి మాట్లాడారు. వారి పిల్లలను బడికి పంపించేలా అవగాహన కల్పించారు. గతంలో ఆ పాఠశాలలో ఒకటి నుంచి తొమ్మి ది తరగతి వరకు ఉండేది. ఈ ఏడాది 10వ తరగతిని కూడా ప్రారంభించారు. మొత్తం 200 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.
అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి
టి.దౌలన్న, కౌన్సిలర్ : దౌదర్‌పల్లి పాఠశాలను అన్ని హంగులున్న ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దాలన్నది నా చిరకాల వాంఛ. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా మరమ్మతులు చేయించి, రంగులు వేయించాను. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌ల తోడ్పాటుతో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాను.
