రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2021-03-22T04:51:44+05:30 IST

వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆదివారం రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వేరుశనగ పంటను కొనుగోలు చేస్తున్నారని రైతులు వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనకు దిగారు.

రోడ్డెక్కిన రైతులు
రోడ్డుపై బైఠాయించిన రైతులు

- వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనకు దిగిన రైతులు

- వ్యాపారులతో వాగ్వాదం

- గంటన్నర పాటు స్తంభించిన వాహనాలు

-  శాంతింపజేసిన పోలీసులు, అధికారులు

అచ్చంపేట, మార్చి 21 : వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆదివారం  రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వేరుశనగ పంటను కొనుగోలు చేస్తున్నారని రైతులు వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనకు దిగారు. ఈ విషయంపై వ్యాపారులు మార్కెట్‌ అధికారులు స్పందించక పోవడంతో పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా కూడలి వరకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. రెండు రోజుల కిందట క్వింటాలుకు రూ.7,318 ఉండగా ఆదివారం రూ.6400లకే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు యత్నించడంతో రెండురోజుల వ్యవధిలోనే రూ.1000 ధర ఎలా తగ్గిస్తారని వ్యాపారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మద్దతు ధరకు కొనుగోలు చేసేంతవరకు వెనక్కి తగ్గేది లేదని రోడ్డుపై బెఠాయించడంతో గంటన్నర పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పి వ్యవసాయ మార్కెట్‌కు రైతులను తరలించారు. రైతులకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. రైతులకు కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం పార్టీలు మద్దతు పలికాయి. ఈ ధర్నాలో ఉప్పునుంతల, బల్మూరు, అచ్చంపేట తదితర మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-22T04:51:44+05:30 IST