రాజేందర్‌, చిట్టెం రూ.కోట్లు సంపాదించారు

ABN , First Publish Date - 2021-12-20T04:15:17+05:30 IST

‘మన ఓట్లతో అగ్రవర్ణాలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా గెలుపొంది, రూ. వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. మక్తల్‌, నారాయణపేట ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి రూ.వందల కోట్లు ఆస్తులు సంపాదించి, ప్రజా సంక్షేమం మరిచారు’ అని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కూమార్‌ విమర్శించారు.

రాజేందర్‌, చిట్టెం రూ.కోట్లు సంపాదించారు
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను సన్మానిస్తున్న నాయకులు

బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కూమార్‌ 


ధన్వాడ, డిసెంబరు 19: ‘మన ఓట్లతో అగ్రవర్ణాలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా గెలుపొంది, రూ. వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నారు. మక్తల్‌, నారాయణపేట ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి రూ.వందల కోట్లు ఆస్తులు సంపాదించి, ప్రజా సంక్షేమం మరిచారు’ అని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కూమార్‌ విమర్శించారు. నారాయణపేట జిల్లా ధన్వాడలో ఆదివారం రాత్రి జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం ఇంకెన్నాళ్లు వారికి ఓట్లు వేద్దామని, అగ్రవర్ణాల వారికి పదవులు సంపాదించిపెట్టి, బహుజనులు బీదవారిగానే ఉండాలా? అని ప్రశ్నించారు. ధన్వాడలో జరిగిన బీఎస్పీ సమావేశంతో ఎమ్మెల్యేల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయన్నారు. బహుజనులను శ్రీమంతులుగా చేయడానికి సర్వీసు ఉన్నప్పటికీ వదులుకొని రాజకీయల్లోకి వచ్చానన్నారు. కమీషన్లు సంపాదించడానికో, ఆస్తులు కూడబెట్టుకోడానికో రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేయాలన్న ధ్యేయంతో వచ్చానన్నారు. రాష్ట్రంలో బహుజనుల రాజ్యం రాబోతుందని, రోజు రోజుకు బీఎస్పీ బలోపేతం కానుండటంతో ప్రగతి భవన్‌లో భూకంపం వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను సాగనంపడానికి బీఎస్పీ కార్యకర్తలు పగలు రాత్రి కష్టపడాలన్నారు. పోలీసులతో బెదిరిస్తారని, ఇంటికి వచ్చి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవాలని భయపెడతారని చెప్పారు. అయినా బీఎస్పీ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని పిలుపునిచ్చారు. ఒక బండి సంజయ్‌, ఒక రేవంత్‌రెడ్డి, ఒక కేటీఆర్‌.. ఇలా వాళ్లను కాదు మనం విమర్శించేదని, ఇన్నాళ్లు వాళ్లకు, వాళ్ల పార్టీలకు మద్దతు ఇచ్చిన మనలను మనమే విమర్శించుకోవలన్నారు. ‘ఇన్నాళ్లు మద్యం, బిర్యాని, డబ్బులు ఇస్తే వాళ్లకు  ఓట్లు వేశాం. మనం ఇలాగే కొనసాగుదామా’ అని యువకులను ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. అందుకు స్పందనగా యువకులు కాదు.. కాదు.. అంటూ కేకలు వేశారు. ఈ సందర్భంగా మక్తల్‌, మాగనూర్‌, మరికల్‌, ధన్వాడ మండలాల నుంచి చాలా మంది యువకులు బీఎస్పీలో చేరారు. వారికి ప్రవీణ్‌ కుమార్‌ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. 


 భారీ ర్యాలీ

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వచ్చిన సందర్భంగా ధన్వాడలో బీఎస్పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్‌కు ఘన స్వాగతం పలికారు. బీసీ కాలనీలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహనికి ప్రవీణ్‌ కుమార్‌ పూలమాల వేసి, నివాళ్లు ఆర్పించారు. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, మెయిన్‌ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. రోడ్డు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. యువకులతో సరదగా క్రికెట్‌ ఆడారు. 


Updated Date - 2021-12-20T04:15:17+05:30 IST