పరిహారం ఏదీ?
ABN , First Publish Date - 2021-11-22T04:09:44+05:30 IST
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం, పునరావాసం కోసం పడిగాపులు కాస్తున్నారు.

పాలమూరు రంగారెడ్డి నిర్వాసితుల ఆవేదన
పరిహారం ఇవ్వకపోవడంతో పనులను అడ్డుకున్న కుడికిళ్ల వాసులు
పునరావారం కల్పించే వరకు పనులను చేయొద్దంటున్న నార్లాపూర్ గ్రామస్థులు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం, పునరావాసం కోసం పడిగాపులు కాస్తున్నారు. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల నిర్వాసితులు నేటికీ పరిహారం అందక ఆందోళనకు గురవుతుండగా, నార్లాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు పునరావాసం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టుల కోసం సర్వం కోల్పోయిన తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- కొల్లాపూర్ రూరల్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొదటగా ముంపునకు గురవుతున్న నార్లాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు పునరావాసం కోసం నిరీక్షిస్తున్నారు. కొల్లాపూర్ మండలం అంజనగిరి, బోడబండ తండా, సున్నపుతండా, ధూల్యనాయక్ తండా, వడ్డె గుడిసెలు ఈ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామసులు సర్వం కోల్పోతున్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా మొదటగా 199 కుటుంబాలకు రూ.5 లక్షలా 4 వేల చొప్పున గతంలోనే చెల్లించింది. మిగిలిన 111 కుటుంబాలకు రూ. 12 లక్షలా 54 వేలు, మేజర్‌లకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.12 కోట్లా 86 లక్షలా 34 వేలను బుధవారం నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసింది. 111 కుటుంబాలకు 622, 623 సర్వే నంబర్లలో 10 ఎకరాలా 18 గుంటల భూమిని డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించింది. పరిహారం ఇచ్చినందున పనులను చేసుకుంటామని అధికారులు నిర్వాసితులతో చెప్పగా, పునరావాసం కల్పించే వరకు పనులు చేపట్టేది లేదని 111 కుటుంబాలు అంటున్నాయి. మరోవైపు తమకూ 111 కుటుంబాలకు అందిన తరహాలోనే పరిహారం ఇవ్వాలని మిగతా 199 కుటుంబాల నిర్వాసితులు రెండు వారాలుగా పనులను అడ్డుకుంటున్నారు.
ఆగిన పనులు
కుడికిళ్ల నిర్వాసితులకు పరిహారం అందకపోవడంతో పథకం మూడో ప్యాకేజీ ప్రధాన కాల్వ పనులను అడ్డుకున్నారు. పనులు రెండు నెలలుగా ఆగిపో యాయి. అంజనగిరి, సున్న పుతండా, ధూల్య నాయక్ తండా, వడ్డెగుడిసెల ముంపు బాధితులకు పునరా వాసం కల్పించ లేదు. దాంతో రెండో ప్యాకేజీలోని నార్లాపూర్ రిజర్వాయర్ పనులు కూడా గత కొన్ని రోజుల నుంచి నిలిచిపోయాయి. పనులను కొనసాగించేందుకు గుత్తేదారులు ప్రయత్నం చేసినా, నిర్వాసితుల నుంచి తీవ్రమైన ప్రతిఘ టన ఎదురవుతోంది. ప్రభుత్వ ఒత్తిడి మేరకు అధికార యం త్రాంగం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేసింది. కుడికిళ్లలో పోలీసులు నిర్వాసితులను ఆదుపులోకి తీసుకొని, లాఠీచార్జి చేసి మరీ భూ సేకరణ చేశారు. సర్వే చేసిన వెంటనే పరిహారం వస్తుందని చెప్పడంతో రైతులు తప్పని పరిస్థితిలో భూములను, ఇళ్లను త్యాగం చేశారు. కానీ ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. 59 మంది నిర్వాసితులకు మొదటి విడతగా రూ.6 కోట్లా 45 లక్షలా 64 వేలా 373 రూపాయలు ఇచ్చేందుకు 17-08-2021న టోకెన్ జనరేట్ అయినా ఇంత వరకు నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. అధికారులు భూ సేకర ణలో చూపిన శ్రద్ధ పునరావాసం కల్పించే విషయంలో చూపడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు.
ఇంకెన్నాళ్లు?
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వలో నిర్వాసితులుగా మారుతున్న కొల్లాపూర్ మండలం కుడికిళ్ల రైతుల పరిస్థితి పెన్నం నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. ఈ గ్రామస్థులు కేఎల్‌ఐ ప్రధాన కాల్వతో పాటు వాటి అనుబంధ కాల్వలకు, మిషనన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం భూములను త్యాగం చేశారు. మళ్లీ పీఆర్‌ఎల్‌ఐ ప్రధాన కాల్వ కోసం 270 ఎకరాల వరకు భూమిని ప్రభుత్వం తీసుకుంది. కేఎల్‌ఐ ప్రధాన కాల్వకు స్వచ్ఛందంగా భూములను త్యాగం చేసి, ఉన్న భూమిలో మామిడి తోటలను పెట్టుకొని పంట చేతికి వచ్చే సమయంలో మళ్లీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు భూములు తీసుకోవడంతో రైతులు మానసికంగా కుంగిపోయారు. కుడికిళ్ల శివారులో 1,500 ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉండగా, అందులో ప్రాజెక్టుల కోసం దాదాపు 400 ఎకరాల వరకు త్యాగం చేశారు. భూములు కోల్పోవడంతో కుడికిళ్ల రైతులు కూలీ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. కుడికిళ్ల శివారులో దాదాపు 250 ఎకరాల్లో కాల్వ పనులు సగం పూర్తి కాగా, రైతులకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదు.
ఎమ్మెల్యే కృషితో పరిహారం
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్వాసితులకు న్యాయం జరిగింది. గతంలో ఉన్న నాయకులు నిర్వా సితులను మోసం చేశారు. ఈ రోజు నిర్వా సితులకు న్యాయ మైన పరిహారం అందుతుంది అంటే అది ఎమ్మెల్యే కృషితో సాధ్యం అయ్యింది. నిర్వాసితులకు త్వరలో పునరాసవం కల్పిస్తారు.
- సునీల్ నాయక్, నిర్వాసిత సంఘం నాయకుడు సున్నపుతాండ
పోరాటం కొనసాగిస్తాం
నార్లాపూర్ రిజర్వాయర్‌లో నిర్వాసితులుగా మారుతున్న అంజనగిరి, బోడబండ తం డా, సున్నపు తండా, ధూల్య నాయక్ తండా, వడ్డెగుడిసెల గ్రామ స్థులకు కాలయాపన చేయకుండా పునరావాసం కల్పించాలి. పూర్తి స్థాయి లో పునరావాసం కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తాం
- హరిలాల్, నిర్వాసిత సంఘం నాయకుడు