కనీస సౌకర్యాలు కల్పించాలి
ABN , First Publish Date - 2021-08-26T04:54:44+05:30 IST
ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలలు తెరుచుకోవడానికి ఆరు రోజుల సమయం ఉంది.. ఈ నేపథ్యంలో కొవిడ్ వల్ల ఏడాదికిపైగా స్కూల్స్ మూసి వేసిన నేపథ్యంలో పునఃప్రారంభంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఏమంటున్నారు?

సిలబస్ తగ్గించాలి
తరగతి గదికి 15 మంది విద్యార్థులే ఉండాలి
గదుల కొరత ఉంటే టెంట్లు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలి
కొవిడ్ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాలి
పాఠశాలల పునఃప్రారంభంపై విద్యావేత్తలు, నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలలు తెరుచుకోవడానికి ఆరు రోజుల సమయం ఉంది.. ఈ నేపథ్యంలో కొవిడ్ వల్ల ఏడాదికిపైగా స్కూల్స్ మూసి వేసిన నేపథ్యంలో పునఃప్రారంభంపై విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఏమంటున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు? సిలబస్‌పై ఏమేం సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఆన్‌లైన్ తరగతుల వల్ల అసలు ప్రయోజనం చేకూరిందా? కరోనా భయం నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తామంటున్నారా? లేదా? వంటి వివరాలతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం మీ కోసం..
- మహబూబ్‌నగర్ విద్యావిభాగం/గద్వాల/నాగర్‌కర్నూల్ టౌన్
కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో స్కూల్స్‌ను సెప్టెంబరు 1 నుంచి తెరిచేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 16 నెలలుగా విద్యార్థులు పాఠశాలల వైపు చూడలేదు. గత ఏడాది మాత్రం 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులు 40 రోజుల పాటు స్కూల్స్‌కు కళాశాలకు వెళ్లొచ్చారు. అంతలోనే కరోనా మహమ్మారి రెండో విడత విజృంభించడంతో విద్యాసంస్థలు మళ్లీ మూతపడ్డాయి. దాంతో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులందరినీ ఎలాంటి పరీక్షలు నిర్వహించకుడానే పాస్ చేశారు. 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి గత జూన్ నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దీంతో విద్యార్థులకు భారం కాకుండా సిలబస్ తగ్గిస్తే బాగుటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకేసారి అన్ని తరగతులు కాకుండా దశల వారీగా నిర్వహిస్తే బాగుంటుందని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. పాఠశాలలను శానిటైజ్ చేయాలని, తరగతి గదిలో కేవలం 15 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని చెబుతున్నారు. గదుల కొరత ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు తెరవడానికి వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో వాటిని శుభ్రం చేసి, తాగునీటి వసతిని పునరుద్ధరించాలని అంటున్నారు.
గత విద్యా సంవత్సరం సిలబస్‌ను 30 శాతం మేరకు తగ్గించి విద్యార్థులకు బోధించారు. కానీ ఈ సారి కుదింపు ఉండదని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్న దృష్ట్యా సిలబస్ కుదింపు ఉండకపోవచ్చని అంటున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 825 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. అందులో 61,414 మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. సిలబస్‌ను తగ్గించడం కన్నా విద్యార్థులను స్కూల్స్‌కు సంసిద్ధులను చేయడమే ముఖ్యమని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం సూచనల ప్రకారం విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న చోట ఇతర తరగతి గదుల్లో విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు సన్నద్ధమౌతున్నామని విద్యాశాఖ చెబుతోంది.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. స్కూల్స్‌ను శానిటైజ్ చేయాలని ఆదేశించాం. ఇప్పటికే కలెక్టర్, అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికా రులు పాఠశాలలను తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి అన్ని మౌలిక వసు తుల కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పీరియడ్స్ సమయంలో ఎలాంటి మార్పులు ఉండవు.
- ఎ.ఉషారాణి, డీఈవో మహబూబ్‌నగర్
సిలబస్ తగ్గిస్తే మంచింది
విద్యా సంస్థలు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నా. ఇప్పటికే మూడు నెలల సమయం గడిచింది. దీనిని దృష్టిలో ఉంచుకొని సిలబస్ 30 శాతం తగ్గించాలి. 70 శాతం సిలబస్ బోధించి, ఆ మేరకు పరీక్షలు నిర్వహించాలి. విద్యార్ధికి తరగతి గది బోధనే మంచిది. దీంతో పాటు ఆటపాటలు కూడా ఉండాలి. అందుకు తగ్గట్లు సౌకర్యాలు కల్పించాలి.
- విజయ్‌కుమార్, రిటైర్డ్ డీఈవో, ప్రముఖ విద్యావేత్త
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కు సరిపడా వసతులు కల్పించాలి. కరోనా దృష్ట్యా ప్రతి తరగతి గదిలో 10 నుంచి 15 మందే ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. గదులు సరిపడా లేకుంటే పాఠశాల ఆవరణలో టెంట్స్ లేదంటే తాత్కాలికంగా రేకుల షెడ్ ఏర్పాటు చెయ్యాలి. టాయిలెట్స్, బాత్‌రూమ్‌లు కూడా సరిపోను ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- వెంకటేష్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
పిల్లలకు ఇబ్బందులు కల్గించొద్దు
ప్రభుత్వం విద్యా సంస్థలను ప్రారం భించడం శుభ పరిణామం. పిల్లలను స్కూల్స్‌కు పంపిస్తాం. కానీ ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పాఠశాలను రోజూ శానిటైజ్ చేయించాలి. విద్యా ర్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలి. బోధనలో శ్రద్ధ వహించాలి.
- శ్రీనివాస్, విద్యార్థి తండ్రి, నంచర్ల
నిబంధనల ప్రకారం నిర్వహిస్తాం
జిల్లాలో 566 ప్రాథమిక, 128 ప్రాథమికోన్నత, 131 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ సూచనల ప్రకారం కొవిడ్ నిబంధనలతో స్కూల్స్‌ను తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేలా, తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట గదుల సౌకర్యాన్ని బట్టి ఇతర గదుల్లో విద్యార్థులను సర్దుబాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
- గోవిందరాజులు, జిల్లా విద్యాధికారి, నాగర్‌కర్నూల్
సిలబస్ తగ్గించాలనడం సరికాదు
చాలా కాలంగా స్కూల్స్ మూత పడడంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్కూల్ అంటే ఏంటో మరిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. స్కూల్స్ తెరవడం ఆలస్యం కావ డంతో సిలబస్ తగ్గించాలనే ఆలోచన సరైంది కాదు. విద్యార్థులు మానసికంగా సిద్ధమయ్యేం దుకు కొంత సమయం పడుతుంది.
- బసవోజు దేవేంద్రాచారి, విజువల్ విద్యా పరిశోధకులు, నాగర్‌కర్నూల్ జిల్లా
జాగ్రత్తలు తీసుకుంటాం
ప్రత్యక్ష బోధన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. గ్రామ పంచాయతీ సహకారంతో పాఠశాలలను శుభ్రం చేయిస్తున్నాం. వారంలో ఒక రోజు వైద్యాధికారులు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటే బాగుం టుంది. పారిశుధ్య సిబ్బందిని నియమించాలి.
- హనుమంతు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, అనంతపురం
సొంత పిల్లలుగా భావించాలి
ఆన్‌లైన్ క్లాసులతో ఇప్పటికే చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో ఉపాధ్యా యులు విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకోవాలి. ఏమాత్రం అనారోగ్యం ఉన్నా వైద్య పరీక్షలు చేయించాలి.
- మద్దిలేటి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, అలంపూర్
