రోడ్డు ప్రమాదంలో మెడిసిన్‌ విద్యార్థి దుర్మరణం

ABN , First Publish Date - 2022-01-01T05:10:32+05:30 IST

రోడ్డు ప్రమాదంలో మెడికల్‌ విద్యార్థి దుర్మరణం చెందాడు. మరికొద్ది రోజుల్లోనే డాక్టర్‌ చదువు పూర్తవనుండగా, కొత్త సంవత్సంలోకి అడుగుపెట్టే ఒక రోజు ముందు ట్రాలీ ఆటో రూపంలో వచ్చిన ప్రమాదం అతన్ని కబళించింది.

రోడ్డు ప్రమాదంలో మెడిసిన్‌ విద్యార్థి దుర్మరణం
భార్గవ్‌

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 31: రోడ్డు ప్రమాదంలో మెడికల్‌ విద్యార్థి దుర్మరణం చెందాడు. మరికొద్ది రోజుల్లోనే డాక్టర్‌ చదువు పూర్తవనుండగా, కొత్త సంవత్సంలోకి అడుగుపెట్టే ఒక రోజు ముందు ట్రాలీ ఆటో రూపంలో వచ్చిన ప్రమాదం అతన్ని కబళించింది. పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సాయి భార్గవ్‌(22) మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. శుక్రవారం స్కూటీపై అప్పన్న పల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొట్టింది. దాంతో భార్గవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీ ఆటో మెడికల్‌ కళాశాలకు పరికరాలు తీసుకెళ్తుండటం గమనార్హం. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని జనరల్‌ ఆస్పత్రికి తరలించి, జహీరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మెడికల్‌ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. తల్లిదండ్రులు సాయంత్రం ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కాగా, వారికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ కూడా మెడిసిన్‌ చదువుతున్నారు. సాయి భార్గవ్‌ పెద్ద కుమారుడు. బాధితుడి తండ్రి ప్రభు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-01T05:10:32+05:30 IST