నిద్రమాత్రలు మింగి వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-06T05:00:18+05:30 IST

నిద్రమాత్రలు మింగి వివాహిత ఆత్యహత్యకు పాల్పడింది. అయితే, వివాహిత ఆత్మహత్యకు ఓ వ్యక్తి కారణమని ఆరోపిస్తూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన శుక్రవారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరిదేవిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

నిద్రమాత్రలు మింగి వివాహిత ఆత్మహత్య
మృతి చెందిన రమణమ్మ

వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో ధర్నా 


గోపాల్‌పేట,  నవంబరు 5: నిద్రమాత్రలు మింగి వివాహిత ఆత్యహత్యకు పాల్పడింది. అయితే, వివాహిత ఆత్మహత్యకు ఓ వ్యక్తి కారణమని ఆరోపిస్తూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన శుక్రవారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరిదేవిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన రమణమ్మ(28)కు రేవల్లి గ్రామానికి చెందిన ముత్యాలయ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. బతుకుదెరువు కోసం మెదక్‌ జిల్లా తుప్రాన్‌లో నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో రమణమ్మ తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందని అనుమానించిన భర్త ఆమెతో గొడవ పడేవాడు. గతేడాది అతనిపై ముత్యాలయ్య రేవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పట్లో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 3న రమణమ్మ ఫోన్‌లో మాట్లాడుతుండగా భర్త మందలించాడు. దీంతో క్షణికావేశంతో రమణమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై తుఫ్రాన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భర్త, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి ఫోన్‌లో మాట్లాడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ముందు ఉంచి ధర్నాకు దిగారు. దీంతో అతను ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. రమణమ్మ మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న రేవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కేసు తుఫ్రాన్‌ స్టేషన్‌లో నమోదైంది కాబట్టి అక్కడికి రెఫర్‌ చేస్తానని ఎస్సై శ్రీనివాసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని అక్కడ్నుంచి తరలించారు. 

Updated Date - 2021-11-06T05:00:18+05:30 IST