మాఫియా బరితెగింపు

ABN , First Publish Date - 2021-12-09T04:15:25+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇసుక నిల్వలు సమృద్ధిగా ఉన్నా వినియోగదారుల అవసరాల మేరకు దొరకడం లేదు. మరోవైపు మాఫియా ఇసుకను అక్రమంగా తవ్వుతూ, లక్షల రూపాయలు దండుకుంటోంది.

మాఫియా బరితెగింపు
దుందుభీ నదిలో నుంచి ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియా(ఫైల్‌)

ప్రభుత్వ ఇసుక రీచ్‌లకు వాహనాలు వెళ్లకుండా రైతులతో అడ్డగింపు

వారు మాత్రం మామూళ్లు ఇచ్చి వెళ్తున్న వైనం

మన ఇసుక మన వాహనం పథకం కింద జిల్లాలో 10 రీచ్‌ల గుర్తింపు

100 ట్రిప్పుల కోసం నమోదు చేసుకోగా.. అందింది 10 మాత్రమే


అచ్చంపేట, డిసెంబరు 8: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇసుక నిల్వలు సమృద్ధిగా ఉన్నా వినియోగదారుల అవసరాల మేరకు దొరకడం లేదు. మరోవైపు మాఫియా ఇసుకను అక్రమంగా తవ్వుతూ, లక్షల రూపాయలు దండుకుంటోంది. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండగా, అటు సామాన్యులు నిర్మాణాలు చేసుకోలేకపోతున్నారు.


అమలుకాని మన ఇసుక మన వాహనం

అప్పటి కలెక్టర్‌ శర్మన్‌ మన ఇసుక మన వాహనం పథకానికి శ్రీకారం చుట్టారు. గత నెల 13న పథకాన్ని ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను తక్కువ ధరకు అందించాలనే ఆ సంకల్పానికి ఇసుక మాఫియా వల్ల మోకాలు అడ్డు పెడుతోంది. మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలను మాఫియా మచ్చిక చేసుకొని ఇసుకను ఇష్టానుసారంగా తవ్వుతూ, డబ్బులు దండుకుంటోంది. మామూళ్లకు రుచిమరిగిన ఆయా శాఖల అధికారులు మాఫియాకు తెరవెనుక నుంచి సపోర్ట్‌ చేస్తునట్లు ఆరోపణలు వస్తున్నాయి.


అన్నీ అడ్డంకులే

జిల్లాలో 70 కిలో మీటర్ల మేర దుందుభీ నది ప్రవహిస్తోంది. దాంతో ఈ ప్రాంతంలో ఇసుకకు కొదవ లేదు. మన ఇసుక మన వాహనం పథకం కింద జిల్లాలో 10 వరకు ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఈ పథకం సక్రమంగా అమలు కాకుండా మాఫియా అడ్డంకులు సృష్టిస్తోంది. ఇసుక రిచ్‌లకు వెళ్లే దారుల్లో రైతులతో వారి పొలాల గుండా పథకం కింద రిజ్రిస్టేషన్‌ అయిన వాహనాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు మాత్రం రైతులకు అంతో ఇంతో ఇచ్చి ఇసుకను తరలిస్తున్నారు. ఈ క్రమంలో మన ఇసుక మన వాహనం పథకం పథకం కింద ఆన్‌లైన్‌లో దాదాపు 100 ట్రాక్టర్లకుపైగా ఇసుక కావాలని నమోదు చేసుకోగా, 10 ట్రాక్టర్ల ఇసుక మాత్రమే అందిందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మాఫియా పథకాన్ని ఏ స్థాయిలో అడ్డుకుంటుందో తెలుస్తోంది. ఇసుక నమోదు చేసుకున్న వినియోగదారులు సంబంధిత శాఖ అధికారులను అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని అంటున్నారు.


అడ్డగోలుగా వసూలు

మన ఇసుక మన వాహనం పథకం కింద ట్రిప్పు ఇసుకకు రూ.2690 రూపాయలు కేటాయించారు. ఇసుక సరఫరా కోసం కిలో మీటరుకు రూ.85 వసూలు చేయాల్సి ఉంది. మొల్గర రీచ్‌ నుంచి ఇసుకను సరఫరా చేస్తున్నందున ఈ రేటు నిర్ణయించారు. కానీ ఇసుక మాఫియా ట్రిప్పునకు రూ.6,000 వసూలు చేస్తున్నారు. అడ్డగోలుగా వసూలు చేస్తూ, నిర్మాణదారులపై భారం మోపుతున్నారు.


త్వరలో ప్రారంభిస్తాం 

జిల్లాలోని ఉప్పునుంతల మండలంలో ఇసుక రీచ్‌లను గుర్తించాం. కానీ సరైన బాటలు లేకపోవడంతో ప్రారంభిం చడం ఆలస్యమైంది. రైతులతో సంప్రదించి వీలైనంతగా త్వరగా ప్రారంభిస్తాం. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి పోతిరెడ్డిపల్లి రీచ్‌ నుంచి ఇసుక సరఫరా చేస్తున్నాం. అందుకే ట్రిప్పునకు రూ.3,650 వసూలు చేయాల్సి వస్తోంది. త్వరలో మొల్గర రీచ్‌ను ప్రారంభిస్తే నిర్ణయిం చిన ధరకే ఇసుకను సరఫరా చేస్తాం.

- వినోద్‌, మైనింగ్‌ అధికారి Updated Date - 2021-12-09T04:15:25+05:30 IST