మరింత అభివృద్ధి చేసుకుందాం

ABN , First Publish Date - 2022-01-01T05:09:06+05:30 IST

‘గత ఏడాదిలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతగానో పని చేశారు. ఇదే స్ఫూర్తితో 2022లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం.’అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

మరింత అభివృద్ధి చేసుకుందాం
అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 31: ‘గత ఏడాదిలో జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతగానో పని చేశారు. ఇదే స్ఫూర్తితో 2022లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం.’అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ ఏడాదిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేసి జిల్లా ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందిద్దామని సూచించారు. శుక్రవారం ఆయన హైదారాబాద్‌ నుంచి కలెక్టర్‌ వెంకట్రావుతో పాటు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ ఏడాది బైపాస్‌ నిర్మాణం పూర్తి చేసుకుని చిన్నదర్పల్లి వరకు బైపాస్‌ను పొడిగిద్దామని అన్నారు. జిల్లా ప్రజలకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖఃసంతోషాలు కలగాలని, ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా అందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని అన్నారు. అధికారులంతా కష్టపడి పని చేస్తున్నారని వారిని అభినందించారు. జిల్లాకు ఈ ఏడాది మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ గురించి మంత్రి మాట్లాడుతూ కరోనా మొదటి, రెండో దశలో అధికారులు, సిబ్బంది చక్కగా పని చేశారన్నారు. జిల్లాలో 70 పడకల ఐసీయూ, 540 పడకల ఆక్సీజన్‌ బెడ్‌లను ఏర్పాటు చేసుకున్నామని, రెండు ఆక్సీజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, ఒక స్టోరేజీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఒమైక్రాన్‌ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్లు తేజస్‌నందలాల్‌ పవార్‌, సీతారామారావు, వైద్యాధికారి డా.కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-01T05:09:06+05:30 IST