కేసీఆర్‌ కక్ష సాధింపు చర్యలు

ABN , First Publish Date - 2021-12-26T05:14:35+05:30 IST

రాష్ట్రంలో కేసీఆర్‌వి అన్నీ కక్ష సాధింపు చర్యలేనని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు.

కేసీఆర్‌ కక్ష సాధింపు చర్యలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ జితేందర్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌ (క్లాక్‌టవర్‌), డిసెంబరు 25 : రాష్ట్రంలో కేసీఆర్‌వి అన్నీ కక్ష సాధింపు చర్యలేనని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. భారత రత్న అటల్‌ బిహారి వాజపేయి జయంతి సందర్భంగా శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటేలా వాజపేయి సేవలందించారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై జరిగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. హుజూరా బాద్‌ నియోజకవర్గం ఎన్నికల్లో అక్కడి ప్రజలు కేసీఆర్‌ను ఓడించారని, ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్ర రైతాంగంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఆగస్టు 31న ఢిల్లీలో జరిగిన మినిట్స్‌ ఆప్‌ మీటింగ్‌లో మనరాష్ట్రంతో పాటు 22 రాష్ట్రాలు పాల్గొని ఏఏ రాష్ట్రం ఎంతెంత ధాన్యం ఇస్తుందో కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా సమా చారం అందించాయని తెలిపారు. ఇప్పుడు భిన్నంగా వ్యవహరిస్తూ కేసీఆర్‌ ధాన్యం కొనుగోలులో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇంకా రాష్ట్ర ప్రభు త్వం 25 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సీజన్‌ లో రా రైస్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తామంటే అంత కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని జితేందర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పోయిన రబీ సీజన్‌లో కేంద్రానికి ఇవ్వాల్సిన 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. ఎవరినైనా కలువాలను కుంటే ముందుగానే వారితో అపాయింట్‌మెంట్‌ తీసుకుంటారని, కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేసేందుకే రాష్ట్రం నుంచి ఎంపీలను, మంత్రులను కేసీఆర్‌ ఢిల్లీకి పంపారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి. చంద్రశేఖర్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమార్‌లు మాట్లాడుతూ వాజపేయి తన జీవితాన్ని దేశంకోసం త్యాగం చేశారని, ఆయన సేవలను కొనియాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, బురుజు రాజేందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, కిష్టయ్య, అంజ య్య, చెన్న వీరయ్య, పోతుల రాజేందర్‌రెడ్డి, కొండ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T05:14:35+05:30 IST