25 నుంచి కందూరు బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-22T03:46:08+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లాకు తలమానికంగా వెలుగొందుతున్న కం దూరు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి.

25 నుంచి కందూరు బ్రహ్మోత్సవాలు
కందూరు దేవాలయం

అడ్డాకుల, మార్చి 21: మహబూబ్‌నగర్‌ జిల్లాకు తలమానికంగా వెలుగొందుతున్న కం దూరు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 21న శ్రీరామనవమి వరకు జాతర కొనసాగించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న స్వామి వారి కల్యాణం, 28న రథోత్సవం ఉంటుంది. ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ఆలయానికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచీ భక్తు లు అధికంగా వచ్చేవారు. గత ఏడాది కరోనా కారణంగా జాతర నిర్వహించ లేదు. ఈ ఏడాది కూడా కరోనా పీడ తొలగి పోలేదు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండకపోవచ్చని నిర్వాహకులు చెబుతు న్నారు.


స్థల మహిమ

కాశీలో తప్ప ఎక్కడా లేని కల్ప వృక్షాలు సహజ సిద్ధంగా ఇక్కడి కోనేరు చుట్టూ ఉన్నాయి. అవి గ్రహ పీడలు తొలగించే శక్తి గలవని భక్తుల నమ్మకం. వీటి కింద వంట చేసుకొని, పట్టెడన్నం దానం చేసి నిద్రస్తే సకల రోగాల నుంచి విముక్తి కలుగుతుందని వారి విశ్వాసం.


ఏర్పాట్లు రెడీ 

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దాతల సహకారంతో ఆలయ వద్ద విశ్రాంతి గదులను, మరుగుదొడ్లను ఏర్పాటు  చేశారు. మిషన్‌ భగీరథ నీటిని, ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను, కోనేరులోకి వెళ్లకుండా కంచె, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువ కావడంతో చలువ పందిళ్లు జాతరలో అక్కడక్కడా ఏర్పాటు చేయాలని, మంచి నీటి వసతి మెరుగుపర్చాలని భక్తులు కోరుతున్నారు. దుమ్ము రాకుండా మట్టి రోడ్లను నీటితో తడపాలని, జాతరలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని అంటున్నారు.



Updated Date - 2021-03-22T03:46:08+05:30 IST