స్నాతకోత్సవానికి వేళాయె..
ABN , First Publish Date - 2021-11-29T04:30:10+05:30 IST
మూడో స్నాతకోత్సవానికి పాలమూరు యూనివర్సిటీ సిద్ధమవుతోంది. వర్సిటీ ఏర్పాటయ్యాక మూడోసారి నిర్వహించాలని భావిస్తోన్న ఈ స్నాతకోత్సవానికి ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించే గవర్నర్ వస్తారనే ఆశాభావంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

పీయూ మూడో స్నాతకోత్సవానికి సిద్ధమౌతున్న పాలమూరు వర్సిటీ
ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
ఒక్కోదశ దాటుతూ పదమూడేళ్ల ప్రస్తానం
వనరుల కల్పన, అధ్యాపక నియామకాల్లో వెనుకబాటు
కొత్త కోర్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్లు
మూడో స్నాతకోత్సవానికి పాలమూరు యూనివర్సిటీ సిద్ధమవుతోంది. వర్సిటీ ఏర్పాటయ్యాక మూడోసారి నిర్వహించాలని భావిస్తోన్న ఈ స్నాతకోత్సవానికి ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వర్తించే గవర్నర్ వస్తారనే ఆశాభావంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సైతం పలు సందర్భాల్లో నిర్వహించిన సమీక్షలు, సమావేశాల్లో పాలమూరు వర్సిటీ గురించి ఆరా తీస్తుండడం, పాలనాపరమైన సూచనలు అందిస్తుండడంతో స్నాతకోత్సవానికి ఆమె వస్తారనే ఆశాభావం అధికారుల్లో వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఇచ్చే సమయాన్ని బట్టే స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకనుగుణంగా ముందస్తు సన్నాహాలు మొదలయ్యాయి. పదమూడేళ్ల ప్రస్తానంలో వర్సిటీ పురోగతి, వనరుల కల్పనలో వైఫల్యాలు, ప్రధానంగా రెగ్యులర్ బోధనా సిబ్బంది కొరత తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలనే చర్చ సాగుతోంది.
- మహబూబ్‌నగర్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి
యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవం 2014లో నిర్వహించగా, రెండో స్నాతకోత్సవం 2019 మార్చిలో జరిగింది. తాజాగా వచ్చే రెండు, మూడు మాసాల్లో మూడో స్నాతకోత్సవం నిర్వహించాలనే యోచనలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ స్నాతకోత్సవంలో 2019-20, 2020-21 విద్యా సంవత్సరాలకు గాను 24 కోర్సులకు సంబంధించి 48 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ఇద్దరికి పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు సుమారు 19 వేల మంది పైచిలుకు విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై జాబితాలు రూపొందించిన యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు, అధ్యాపకులకు సమాచారం తెలియజేస్తున్నారు. గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. గవర్నర్ ఇచ్చే సమయాన్ని బట్టి స్నాతకోత్సవ తేదీ ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఒక్కో దశ దాటుతూ
వెనుకబడిన పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యను చేరువచేయడం ద్వారా ఉపాధి, విద్యా వనరులు పెంచాలనే సంకల్పంతో 2008లో మహబూబ్‌నగర్‌లో పాలమూరు వర్సిటీకి అంకురార్పణ చేశారు. అప్పటికే ఇక్కడ కొనసాగుతున్న ఓయూ అనుబంధ పీజీ సెంటర్‌నే వర్సిటీగా ఏర్పాటు చేశారు. 28 జూలై, 2008లో ప్రారంభించారు. మొదట పీజీలో మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, ఎంబీఏ, కామర్స్, మ్యాథ్స్, ఎంసీఏ, ఇంగ్లీషు కోర్సులను ప్రవేశపెట్టారు. వర్సిటీ భవనాలు నిర్మాణం కాకమునుపు పీజీ సెంటర్ లోనే తాత్కాలిక కార్యాల యంతో నెట్టుకొచ్చారు. అనంతరం మహబూబ్ నగర్ పట్టణ శివార్లలోని బండమీదపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ భూమి 176 ఎకరాలను వర్సిటీకి కేటాయించారు. దాంతో అక్కడ క్యాంపస్ నిర్మాణం చేపట్టారు. 2012 నుంచి క్యాంపస్ కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రమేపీ ఒక్కో కోర్సును పెంచుతూ ప్రస్తుతం 17 కోర్సులలో విద్యనందిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంఎస్‌డబ్ల్యూ, పొలిటికల్ సైన్స్, ఫార్మసీ, ఎంఈడీ, కంప్యూటర్ సైన్సెస్, జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, ఎకనామిక్స్ తదితర కోర్సులతో దాదాపు అన్ని విభాగాల ద్వారా బోధనసాగుతోంది. ప్రస్తుతం క్యాంపస్ కాలేజీలతో పాటు వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌లలో పీజీ సెంటర్లు నడుస్తున్నాయి. మొదటి ఏడాది 420 మంది విద్యార్థులుండగా, ఈ యేడాది 2,340 మంది విద్యార్థులు వర్సిటీ ద్వారా నేరుగా విద్యన్యభసిస్తున్నారు. అనుబంధ డిగ్రీ కళాశాలల్లో మరో లక్ష మంది వరకు చదువుకుంటున్నారు. వీటితో పాటు ప్రైవేట్‌వి 15 పీజీ, 27 బీఈడీ, నాలుగు ఫార్మసీ, రెండు ఎంఈడీ, మూడు బీపీఈడీ, ఐదు ఎంబీఏ కళాశా లలో వర్సిటీ అనుబంధంగా కొనసాగు తున్నాయి. మొత్తంగా మహబూబ్న గర్‌లో వర్సిటీ ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎందరో విద్యా ర్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా వర్సిటీ ద్వారా దాదాపు 1.25 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిం చడం గర్వకారణమని ఇక్కడి అధ్యాపకులు భావిస్తున్నారు.
అంతే స్థాయిలో పెరగని వనరులు
యూనివర్సిటీ ఏర్పాటైన పద మూడేళ్లలో క్రమేపీ కోర్సులు, విద్యార్థులు పెరుగుతూ వస్తున్నప్పటికీ వనరులు, సిబ్బంది మాత్రం ఆ స్థాయిలో సమకూర లేదు. అందలేదు. ప్రధానంగా ప్రొఫెసర్లు, అసోసి యేట్ ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు కనీసం 150 మంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం రెగ్యులర్ బోధనా సిబ్బంది 20 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో 120 మంది అకడమిక్ కన్సల్టెంట్లను నియమించుకొని విద్యా బోధన సాగిస్తున్నారు. బోధనా సిబ్బందికి సంబంధించి 60 మంది నియామకం కోసం ప్రభుత్వం జీవో ఇచ్చినా నియామకాలు మాత్రం జరగలేదు. నాన్‌టీచింగ్ సిబ్బంది నియామ కాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. వారు మొత్తం 200 మంది వరకు అవసరముండగా, కేవలం ఇద్దరు మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. మరో 143 మందిని తాత్కాలిక పద్ధతిన నియమించుకున్నారు. యూని వర్సిటీలో సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే, మౌలిక సదుపాయాల కల్పనలోనూ పూర్తి స్థాయి వనరులు సమకూర లేదు. భవనాలు, వనరుల కల్పనలో ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచీ ఒకటి, రెండు సందర్భాల్లో మినహా జీతభత్యాలు, చిన్న, చిన్న అవసరాలకు మాత్రమే నిధులిస్తుం డడంతో కీలకమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. వీటితో పాటు వర్సిటీలో ప్రస్తుతం ఉన్న కోర్సుల తో పాటు ఇంజనీరింగ్, లా, జర్నలిజం, ఉర్ధూ విభాగాలను కూడా ఏర్పాటు చేయాలని విద్యార్థుల నుంచి విన్నపాలు వస్తున్నా, ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.