అయిజలో అక్రమ దందా

ABN , First Publish Date - 2021-11-24T04:02:38+05:30 IST

అయిజ మునిసిపాలిటీలో కొందరు అధికారులు, సిబ్బంది, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు.

అయిజలో అక్రమ దందా
నకిలీ అనుమతులతో విక్రయించిన భూమి ఇదే..

నకిలీ పత్రాలతో రూ.కోట్ల విలువైన భూమి విక్రయం

అసలు పట్టాదారుకు తెలియకుండానే బాగోతం

చేతివాటం ప్రదర్శించిన పుర సిబ్బంది, మాజీ ప్రజాప్రతినిధి భర్త

పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టాదారు, మునిసిపల్‌ చైర్మన్‌

11 మందికి పాత్ర.. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు


అయిజ మునిసిపాలిటీలో కొందరు అధికారులు, సిబ్బంది, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. మునిసిపాలిటీలో మొన్నటికి మొన్న అసైన్డ్‌ భూములను అమ్మేసిన ఘటన వెలుగులోకి రాగా, తాజాగా పురపాలక సిబ్బంది ఇంటి నిర్మాణాలకు నకిలీ అనుమతులు ఇవ్వడంతో వాటి ద్వారా ఏకంగా భూమి యజమానికే తెలియకుండా ప్లాట్లు విక్రయించిన విషయం బయటపడింది. సబ్‌ రిజిస్ర్టార్‌ అధికారులు కేవలం ఇంటి అనుమతులను ఆసరా చేసుకొని రూ.కోట్ల విలువ చేసే భూమిని రిజిస్ర్టేషన్‌ చేసేశారు. ఈ దందాలో సుమారు 11 మంది భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, బాధితుడు వీరన్న ఫిర్యాదులతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.

- ఆంధ్రజ్యోతి, గద్వాల


అయిజ మునిసిపాలిటీ పరిధిలో వివాదస్పదంగా ఉన్న భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అక్రమంగా విక్రయించడం పరిపాటిగా మారింది. మధ్యలో అధికారులకు కొంత ముట్టజెప్పి, తమ పని కానిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఘటన అందుకు అద్దం పడుతోంది. మునిసిపాలిటీకి చెందిన తెలుగు వేణు 950 సర్వే నంబర్‌లో తనకు ఏడు గుంటల భూమి ఉందని చెప్పి, ఇందులో ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు డబ్బు అసవరం ఉందని బలిజ విరుపాక్షి, బీచుపల్లి, స్రవంతిలకు ఆ భూమిని విక్రయించాడు. కేవలం ఇంటి అనుమతులను ఆసరాగా చేసుకుని మాత్రమే గద్వాల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఆ భూమిని రిజిస్ర్టేషన్‌ చేశారు. అయితే గత నెల 20న తెలుగు వీరన్న తన ఏడు గుంటల భూమిని వేరే వారిపై ఎలా రిజిస్ర్టేషన్‌ చేశారని గద్వాల సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఇంటి అనుమతులను బేస్‌ చేసుకుని రిజిస్ర్టేషన్‌ చేసినట్లు సబ్‌ రిజిస్ర్టార్‌ లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. ఈ క్రమంలో తెలుగు వీరన్న మునిసిపాలిటీ ఆఫీసుకు వెళ్లి గత నెల 23న ఇంటి అనుమతులపై సమాచార హక్కుచట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. మునిసిపాలిటీ అధికారులు తాము ఎలాంటి అనుమతీ ఇవ్వలేదని, అనుమతుల పేరుతో చూపించిన డాక్యుమెంట్లు ఫేక్‌ అని వీరన్నకు సమాచారం ఇచ్చారు. దీంతో మళ్లీ వీరన్న సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసుకు వెళ్లి రిజిస్ర్టేషన్‌ క్యాన్సిల్‌ చేయాలని కోరాడు. సబ్‌ రిజిస్ర్టార్‌ వెంటనే ఆ భూమిని అమ్మినవారికి, కొనుగోలు చేసిన వారికి  నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారి నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో సబ్‌ రిజిస్ర్టార్‌ గద్వాల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో తెలుగు వీరన్నతో కలిసి ఫిర్యాదు చేశారు. తెలుగు వీరన్న అక్కడ నుంచి రిసీవ్‌ కాపీ తీసుకుని ఈ నెల ఎనిమిదిన అయిజ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


కేసు నమోదు.. ముగ్గురు రిమాండ్‌..

అసలు తన భూమి కాని దాన్ని తెలుగు వేణు నకిలీ ఇంటి అనుమతుల పత్రాల పేరుతో విక్రయించాడు. వేణుకు ఇదే సర్వే నంబర్‌లో ఉన్న 2 గుంటల భూమి 2007లోనే ఆర్‌అండ్‌బీ రోడ్డులో పోయింది. దానికి ఆర్‌ఓఆర్‌ ఇంప్లిమెంటేషన్‌ కూడా జరిగింది. కానీ వేణు కొంతమందితో కలిసి ఈ అక్రమ దందాకు ప్రయత్నించడంతో భూమి అసలు యజమాని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లో మొత్తం పదకొండు మందిపై ఐపీసీ 120 బీ, 420,417,467,468,471,506 ఆర్‌/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారిలో తెలుగు వేణు, బీచుపల్లి, స్రవంతి, బిలజ విరుపాక్షి, సింగోటం వెంకటేశ్‌, ఎలియాజర్‌ (మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రాజేశ్వరి భర్త. ఈయన గతంలో కూడా అవినీతి కేసులో నిందితుడిగా ఉన్నాడు), తెలుగు వెంకట్రాములు, తెలుగు విజయ్‌కుమార్‌, తెలుగు లక్ష్మన్న, తెలుగు శంకర్‌, మహ్మద్‌ ఖాజా అలియాస్‌ మున్నా ఉన్నారు. అలాగే మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న ఇచ్చిన ఫిర్యాదులో మునిసిపాలిటీలో ఈ అక్రమ అనుమతులకు, మునిసిపాలిటీ ఆదాయం పోవడానికి బిల్‌ కలెక్టర్‌ ఇస్మాయిల్‌, అతడి కుమారుడు మహబూబ్‌పాషా, మహ్మద్‌ ఖాజా అలియాస్‌ మున్నానే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేవన్న ఫిర్యాదుపై ఎస్‌ఐ ముత్తయ్యను వివరణ కోరగా, విచారణ చేపట్టామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ముగ్గురు నిందితులు వెంకటేష్‌, ఎలియాజర్‌, మహ్మద్‌ ఖాజా అలియాస్‌ మున్నాను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా, ఆ నకిలీ అనుమతి పత్రాలతో విక్రయించిన భూమి విలువ దాదాపు రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా.


అక్రమ అనుమతులతో రిజ్రిస్టేషన్‌

సర్వే నంబర్‌ 950లో నాకు 7 గుంటల భూమి ఉంది. దాన్ని వేరే వ్యక్తులు అక్రమ పద్ధతిలో కొను గోలు చేశారు. సబ్‌ రిజిస్ర్టార్‌ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇంటి అనుమతులతో రిజిస్ర్టేషన్‌ చేశా మని చెప్పారు. మునిసిపాలిటీలో అడిగితే ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదన్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నా భూమి ఆక్రమించాలని చూసిన వారిని వదలను. మునిసిపాలిటీలో కొంతమంది ఇలా అవినీతికి పాల్పడి, చాలా మందికి అన్యాయం చేస్తున్నారు. 

- తెలుగు వీరన్న, బాధితుడు

అవినీతి చేస్తే వదిలేది లేదు

మునిసిపాలిటీలోని కొందరు సిబ్బంది అక్రమార్జనకు ఆశపడి, ఇంటి నిర్మాణం కోసం నకిలీ అను మతులు ఇస్తున్నారు. ఇందులో ప్రైవేటు సర్వేయర్‌ పాత్ర కూడా ఉంది. అతడు ఎలా పత్రాలు తెచ్చి నా అక్రమ పద్ధతిలో చేసిపెడుతు న్నారు. మునిసిపాలిటీ ఆదాయా నికి గండికొడుతున్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇదే విషయమై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాను. వారు విచారణ చేసి చర్యలు తీసుకుం టామన్నారు. 

- దేవన్న, మునిసిపల్‌ చైర్మన్‌, అయిజ 



Updated Date - 2021-11-24T04:02:38+05:30 IST