పాఠశాలల్లో ‘హరివిల్లు’

ABN , First Publish Date - 2021-04-07T05:09:13+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పాఠశాలల్లో ‘హరివిల్లు’
ఉత్తనూరు ప్రాథమిక పాఠశాల

- విలువలతో కూడిన విద్యా విధానానికి శ్రీకారం

- జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

- ఉపాధ్యాయులకు ప్రారంభమైన శిక్షణ

    అయిజ, ఏప్రిల్‌, 6 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ విధ్యావిధానంలో భాగంగా కేంద్రప్రభుత్వం విద్యాబోధనలో మార్పులు తీసుకురావాలని భావిం చింది. చిన్నారుల్లో మానసికోల్లాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఆట, పాటలతో కూడిన భోధనను అందించాలని నిర్ణయించింది. అనందాత్మక అభ్యసనం(జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌)ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని ఛత్తీస్‌గఢ్‌లో పరివర్తన్‌, ఢిల్లీలో హ్యాపీనెస్‌ క్లాస్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఆనందవేదిక పేర్లతో అమలుచేస్తున్నారు. మన రాష్ట్రంలో ‘హరివిల్లు’ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఇది 10వ తేదీ వరకు కొనసాగనున్నది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లాలోని అయిజ, వడ్డేపల్లి, రాజోలి, ఉండవల్లి, మానవపాడు, అలంపూర్‌ మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు గద్వాల, మల్దకల్‌, ధరూరు, గట్టు, కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఇప్పటికే శిక్షణ పొందిన జిల్లా ఆర్పీలు జూమ్‌యాప్‌ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. 


పైలెట్‌ ప్రాజెక్టుగా జోగుళాంబ గద్వాల

    హరివిల్లు కార్యక్రమానికి సంబంధించి పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు 2018-2019 విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల, మహబూబాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలను ఎంపిక చేసింది. సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా కార్యక్రమాన్ని కొనసాగించింది. ఇది విజయవంతం కావటంతో దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని విద్యాశాఖ ఆదేశించింది. గతంలో 1, 2 తరగతుల వారికి మాత్రమే శిక్షణ నివ్వగా, ప్రస్తుతం ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు అమలు చేయనున్నారు.

    

1,051 మంది ఉపాధ్యాయులకు శిక్షణ

    హరివిల్లు కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమలుచేస్తున్నారు. జిల్లాలో 466 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో అందులో 88 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 18,500 మంది, 288 ప్రాథమిక పాఠశాలల్లో  26,300 మంది విద్యార్థులు ఉన్నారు. వాటిల్లో పని చేస్తున్న 1,051 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందుతున్నారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులను ఒకటవ స్థాయిగాను, 3, 4, 5 తరగతుల వారిని రెండవ స్థాయిగానూ విభజించి భోధన కొనసాగించనున్నారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు ప్రతీ రోజు పాఠశాలల్లో విద్యార్థులకు కృత్యాలు, కథలు, ఆట పాటలతో విద్యను బోధిస్తారు. విద్యార్థుల్లో కుటుంబం, వ్యక్తిత్వం, సమాజం, ప్రకృతిపై కరుణ, ప్రేమ, గౌరవం, కృతజ్ఞతాభావం, ధైర్యం, నమ్మకం, నిజాయితీలు పెంపొందేలా ఈ శిక్షణ ఉంటుంది. సోమవారం మానసిక సంసిద్ధత, మంగళ, బుధవారాల్లో కథలు, ప్రతిస్పందనలు ఉంటాయి. గురు, శుక్రవారాల్లో విలువలు పెంపొందించేలా 12 కృత్యాలతో బోధన, శనివారం భావవ్యక్తీకరణ (3, ,4, 5 తరగతులకు), సమన్వయ కృత్యాలు(1, 2 తరగతులకు) తెలియజెప్తారు. హరివిల్లు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు మంగళవారం ప్రారంభమైన శిక్షణ 10వ తేదీ వరకు కొనసాగనుంది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ శిక్షణ కొనసాగుతోంది. ప్రతీ ఉపాధ్యాయుడు వారి పాఠశాలలోనే ఉండి తమ సెల్‌ఫోన్‌ ద్వారా శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. 


పాఠశాలకు వెళ్లాలన్న ఆసక్తి కలగాలి

    విద్యార్థులకు పాఠశాలలకు వెళ్ళాలన్న ఆసక్తిని పెంచేందుకు ప్రభు త్వం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆటపాటలు, విలువలతో కూడిన విద్యా విధానాన్ని అందించాలన్నదే హరివిల్లు లక్ష్యం. ప్రస్తుతం ఉపాధ్యాయులు అందుకు అవసరమైన శిక్షణ పొందుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. 

- సుశీందర్‌రావు, జిల్లా విద్యాధికారి.




Updated Date - 2021-04-07T05:09:13+05:30 IST