నల్లమలలో గుడుంబా జోరు

ABN , First Publish Date - 2021-12-09T04:13:44+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గుడుంబా, గంజాయి జోరు కొనసాగుతోంది. పల్లెకు పది బెల్టు షాపులతోపాటు నాటుసారా కూడా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖలోని సిబ్బంది సారా తయారీదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

నల్లమలలో గుడుంబా జోరు
నల్లమలలో నాటుసారా తయారీ ప్రాంతాన్ని గుర్తించిన ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు సిబ్బంది

అరకొర సిబ్బందితో నామమాత్రపు దాడులు

తయారీదారులతో కొందరు సిబ్బంది మిలాఖత్‌

జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న సారా కేసులు

కొనసాగుతున్న బెల్లం అక్రమ రవాణా


నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గుడుంబా, గంజాయి జోరు కొనసాగుతోంది. పల్లెకు పది బెల్టు షాపులతోపాటు నాటుసారా కూడా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖలోని సిబ్బంది సారా తయారీదారులకు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండ తండాకు చెందిన భాస్కర్‌నాయక్‌ బెల్లం తరలిస్తుండగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతని వద్ద గల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, కాల్‌లిస్టులోని రికార్డులను పరిశీలించగా ఎక్సైజ్‌ శాఖకు చెందిన కానిస్టేబుళ్లు వసూరాం నాయక్‌, కృష్ణయ్య స్మగ్లర్లతో జరిపిన సంభాషణ ఉండటంతో ఉన్నతాధికారులు విస్తుపోయారు. ఇలా శాఖలోని కొందరు కింది స్థాయి సిబ్బంది సారా తయారీదారులతో మామూళ్లు తీసుకుని, టాస్క్‌ఫోర్సు దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే చేరవేస్తుండటంతో సారా తయారీ యథేచ్ఛగా కొనసాగుతోంది.


11 నెలల్లో 766 కేసులు

జిల్లాలో నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజక వర్గాలుండగా ఈ ఏడాది నవంబరు వరకు 766 సారా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లోనే నమోదయ్యాయి. నల్లమల ఏజెన్సీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని నాటుసారా తయారు చేస్తున్నారు. జిల్లాలోని ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో ఉన్నతాధికారులతో సహా కలిపి వంద మంది సిబ్బంది కూడా లేకపోవడంతో దాడులు ముమ్మరం చేసే వెసులుబాటు లేకుండా పోయింది. నవంబరు వరకు సారా తయారీకి సంబంధించి 577 కేసులు నమోదు కాగా, 410 మందిని అరెస్టు చేశారు. 54 వాహనాలను సీజ్‌ చేసి, 2,659 లీటర్ల సారాను పట్టుకున్నారు. బెల్లం అక్రమ రవాణాకు సంబంధించి 87 కేసులు నమోదయ్యాయి. 170 మందిని అరెస్టు చేశారు. రికార్డు స్థాయిలో లక్షా 12,244 కేజీల బెల్లం సీజ్‌ కావడం గమనార్హం. బెల్లం అక్రమ రవాణా చేస్తున్న 34 వాహనాలను కూడా సీజ్‌ చేశారు. మూడు గంజాయి కేసులు కూడా జిల్లాలో నమోదయ్యాయి. అచ్చంపేట ప్రాంతంలో కల్తీ కల్లు మరణాలు సంభవించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. నెల వ్యవధిలో ఇద్దరు మహిళలు కల్తీ కల్లు కాటుకు బలయ్యారు. 


నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం

జిల్లాలో నాటుసారా తయారీదారులు, బెల్లం అక్రమ రవాణా చేసే వారిపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశాం. సారా తయారీ కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. బెల్లం అక్రమ రవాణా అవుతున్న ప్రాంతాలపై దృష్టి సారించాం. నాటుసారా తయారీ, కల్తీ కల్లును ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. 

- హెచ్‌.దత్తురాజుగౌడ్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

Updated Date - 2021-12-09T04:13:44+05:30 IST